
లోకాయుక్తకు చిక్కిన అరణ్యాధికారిణి
చింతామణి: రైతు నుంచి లంచం తీసుకుంటూ అరణ్యాధికారిణి లోకాయుక్తకు పట్టుబడింది. శ్రీనివాస్ అనే రైతుకు శ్రీనివాసపుర రోడ్డులో పెట్రోల్‌బంకు ఏర్పాటుకు అనుమతి లభించింది. అయితే బంక్ నిర్మాణానికి అడ్డంగా ఉన్న చెట్లను తొలగించాలని శ్రీనివాస్ పట్టణంలోని అరణ్యాధికారిణి శోభను సంప్రదించాడు. ఆమె రూ. 50 వేలు లంచం డిమాండ్ చేయడంతో రైతు లోకాయుక్తకు ఫిర్యాదు చేశాడు. పథకం ప్రకారం బాధితుడు లంచం ఇస్తుండగా లోకాయుక్త ఎస్పీ ఆంటోని, డీఎస్పీ వీరేంద్ర కుమార్‌లు దాడి చేశారు. అధికారిణి శోభను, ఆమె కారు డ్రైవర్ మణిని అరెస్ట్ చేశారు.
సీఐపై సస్పెన్షన్ వేటు
దొడ్డబళ్లాపురం: పవిత్ర గ్రంథాన్ని దుండగులు కాల్చివేసిన సంఘటనకు సంబంధించి సీఐను సస్పెండ్ చేసిన సంఘటన బెళగావిలో చోటుచేసుకుంది. కొన్ని రోజుల క్రితం బెళగావి తాలూకా సంతిబస్తవాడ గ్రామంలో ఒక మతానికి చెందిన గ్రంథాన్ని కొందరు తస్కరించి కాల్చివేశారు. ఈ సంఘటన తీవ్ర వివాదానికి దారితీసింది. ఈ వ్యవహారంలో సీఐ విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తేలడంతో సస్పెండ్ చేసినట్లు బెళగావి సిటీ పోలీస్ కమిషనర్ యడా మార్టిన్ తెలిపారు. ఈద్గా గోపురాన్ని ధ్వంసం చేసిన కేసులో కూడా సీఐ నిర్లక్ష్యంగా వ్యవహరించారన్నారు.
భార్యను కడతేర్చి ఠాణాలో లొంగిపోయిన భర్త
బనశంకరి: భార్యను కడతేర్చిన భర్త పోలీసుల వద్ద లొంగిపోయాడు. ఈఘటన బాణసవాడిలో జరిగింది. జయలక్ష్మి పాఠశాల సమీపంలో నివాసం ఉంటున్న రమేష్ మొదటి భార్యతో విడిపోయి కలైవాణి అనే మహిళను వివాహం చేసుకున్నాడు. మొదటి భార్య పిల్లలను రమేష్ కలిసిన విషయంలో శుక్రవారం తెల్లవారుజామున దంపతుల మధ్య గొడవ జరిగింది. ఓ దశలో రమేష్ కలైవాణిపై దాడి చేసి హతమార్చాడు. అనంతరం నేరుగా బాణసవాడి పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. బాణసవాడి పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేపట్టారు.
ఎలక్ట్రిక్ బస్సుల
కేటాయింపునకు అంగీకారం
శివాజీనగర: బెంగళూరుతో పాటు రాష్ట్రంలో ప్రముఖ నగరాల్లో ప్రజల రవాణా సదుపాయాలను మరింత మెరుగుపరిచేందుకు పీఎం ఈ–డ్రైవ్ పథకం కింద ఎలక్ట్రిక్ బస్సులు మంజూరు చేయాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈమేరకు కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి హెచ్.డీ.కుమారస్వామిని ఢిల్లీలోని కార్యాలయంలో కలిసి చర్చలు జరిపారు. కర్ణాటక ప్రభుత్వానికి కేంద్రం నుంచి పూర్తి మద్దతు ఇవ్వనున్నట్లు కుమారస్వామి భరోసా ఇచ్చారు. కర్ణాటకకు దశల వారీగా విద్యుత్ చార్జింగ్ బస్సులను పంపిణీ చేస్తామని భరోసానిచ్చారు. నగర ప్రాంతాల్లో కాలుష్యాన్ని అరికట్టేందుకు కర్ణాటకతో పాటు దేశ వ్యాప్తంగా విద్యుత్ చార్జింగ్ బస్సులు నడిపేందుకు కేంద్రం పెద్ద స్థాయిలో ప్రయత్నం చేస్తోందన్నారు.
టర్కీ సెలెబి ఏవియేషన్ సేవలు రద్దు
దొడ్డబళ్లాపురం: పాకిస్తాన్‌కు మద్దతుగా నిలచిన టర్కీకి కెంపేగౌడ ఎయిర్‌పోర్టు అధికారులు షాక్ ఇచ్చారు. టర్కీ సెలెబి ఏవియేషన్ ఎయిర్‌పోర్టు సేవలను గురువారం అర్ధరాత్రి నుంచి నిలిపివేశారు. కేంద్రప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎయిర్‌పోర్టులో రోజూ 15 అంతర్జాతీయ విమానాలు, కార్గో విమానాలను సెలెబి ఏవియేషన్ నిర్వహిస్తుండేది. దేశంలోని 9 ఎయిర్‌పోర్టుల్లో ప్రాథమిక స్థాయి సేవలు అందిస్తున్న టర్కీ సెలెబి ఏవియేషన్ కంపెనీకి మంజూరు చేసిన సేఫా లైసెన్స్‌ను బీసీసీఎస్ రద్దు చేసింది. జాతీయ భద్రత నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది.

లోకాయుక్తకు చిక్కిన అరణ్యాధికారిణి

లోకాయుక్తకు చిక్కిన అరణ్యాధికారిణి