
ఘనంగా వ్యవసాయ వర్సిటీ స్నాతకోత్సవం
హుబ్లీ: ఽదార్వాడ వ్యవసాయ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. 38వ వార్షిక స్నాతకోత్సవంలో రాష్ట్ర గవర్నర్ థావర్‌చంద్ గెహ్లోట్‌తో పాటు ప్రజాప్రతినిధులు, విశ్వవిద్యాలయ ఉన్నతాధికారులు, ఆ కళాశాల విద్యార్థులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు. గవర్నర్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ఇక్కడ మీరు నేర్చుకున్న శాసీ్త్రయ విజ్ఞాన విషయాలన్నీ రాష్ట్రంలోని ప్రతి ఒక్క గ్రామ రైతుకు ఉపయోగపడాలని పిలుపునిచ్చారు. ఆత్యాధునిక పద్ధతితో వ్యవసాయ రంగంలో భారత దేశం అన్నింటా ముందంజలో ఉండేందుకు ఇక్కడ పట్టా పుచ్చుకున్న ప్రతి విద్యార్థి తమదైన శైలిలో తాము ఉన్న ఊరితో పాటు పరిసర గ్రామాల అన్నదాతలకు మేలు జరిగేలా కృషి చేయాలన్నారు. ముఖ్యంగా అధ్యాపక బృందం విద్యార్థులకు సాగు పాఠాలతో పాటు దేశంలోని అన్నదాతలు అప్పులు తదితర బాధలతో కుంగిపోకుండా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు వారిలో ఎప్పటికప్పుడు మనోసైర్యం నింపేలా మేలైన సాగు పద్ధతులు వారికి వివరించాలని ఆయన సూచించారు. కాగా వివిధ విభాగాల్లో బంగారు తదితర పతకాలు అందుకున్న విద్యార్థులతో పాటు స్నాతకోత్సవ పట్టా పుచ్చుకున్న వారందరికీ సర్టిఫికెట్లను ముఖ్య అతిథులు ప్రదానం చేశారు.
పోక్సో కేసులో నిందితుడికి ఐదేళ్ల జైలు శిక్ష
హుబ్లీ: పోక్సో కేసులో నిందితుడిపై ఆరోపణలు రుజువు కావడంతో ధార్వాడ రెండో అదనపు జిల్లా సెషన్స్ కోర్టు దోషికి ఐదేళ్ల కారాగార శిక్షతో పాటు రూ.15 వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది. రాఘవేంద్ర వాసుదేవ బెళగుర్కి శిక్షకు గురైన దోషి. ఇక్కడి కసబాపేటె పోలీస్ స్టేషన్‌లో అతడిపై 2023లో కేసు నమోదైంది. కేసు దర్యాప్తు చేపట్టిన సీఐ రాఘవేంద్ర హళ్లూర కోర్టుకు చార్జిషీట్‌ను సమర్పించారు. కేసు వాద, ప్రతివాదనలు విన్న సదరు కోర్టు న్యాయమూర్తి రాజకుమార్ పైమేరకు శిక్ష విధించినట్లు, ఈ కేసులో ప్రభుత్వం తరఫున వాదించిన న్యాయవాది శైల అంగడి తెలిపారు.
మద్దతు ధర పెంపునకు ఒత్తిడి
రాయచూరు రూరల్: ఽవాణిజ్య పంటలకు మద్దతు ధర పెంచాలని రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షుడు చామరస మాలిపాటిల్ డిమాండ్ చేశారు. బుధవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏపీఎంసీ మార్కెట్‌కు రోజుకు వందలాది టన్నుల మేర వరి ధాన్యం వస్తోందన్నారు. రైతులు మార్కెట్‌కు తెచ్చిన వరి, మిరప, జొన్నలు, కంది ధాన్యాలకు ధరలు లేక తల్లడిల్లి పోతున్నారన్నారు. ప్రభుత్వం వెంటనే జోక్యం కల్పించుకొని వరి, మిరప, జొన్నలు, కంది ధాన్యాల కొనుగోలుకు మధ్యవరిత్త్వం వహించి రైతులను ఆదుకోవాలన్నారు. వానలకు కొట్టుకు పోయిన పంటలకు పరిహారం అందించాలన్నారు. వారం రోజుల్లో తమ సమస్యలకు పరిష్కారం చూపకపోతే జిల్లా ఇన్‌చార్జి మంత్రిని ఘెరావ్ చేస్తామని హెచ్చరించారు.
అధిక ఫీజుల వసూలు తగదు
రాయచూరు రూరల్: జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలల్లో అధికంగా డొనేషన్లు, ఫీజులు వసూలు చేయడం తగదని సీపీఐ(ఎంఎల్–రెడ్ స్టార్) అధ్యక్షుడు గంగాధర్ ఆరోపించారు. బుధవారం జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో ఆయన మాట్లాడారు. మధ్య తరగతి పిల్లలు ప్రైవేట్ పాఠశాలలో చదవాలంటే రూ.లక్షల్లో డొనేషన్లు, వేలలో ఫీజులు వసూలు చేస్తున్నా జిల్లా, తాలూకా విద్యా శాఖాధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరించడాన్ని ఖండించారు. అధిక ఫీజులు వసూలు చేయరాదంటూ, అలాంటి పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ముఖ్యమంత్రికి పంపదలచిన వినతిపత్రం సమర్పించారు.

ఘనంగా వ్యవసాయ వర్సిటీ స్నాతకోత్సవం