
నలుగురి హత్య కేసులో దోషికి ఉరిశిక్ష
హుబ్లీ: కార్వార సమీపంలోని భట్కళ తాలూకాలోని ఆడువళ్లి ఓణిబాగిలు గ్రామంలో ఆస్తి విషయానికి సంబంధించి రెండేళ్ల క్రితం జరిగిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురి హత్య కేసుకు సంబంధించి నిందితుడికి ఆ జిల్లా సెషన్స్ కోర్టు మంగళవారం మరణ శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. కార్వార సెషన్స్ కోర్టు గత 40 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా ఉరిశిక్ష ప్రకటించిందని సీనియర్ న్యాయవాదులు తెలిపారు. రాష్ట్ర స్థాయిలో సదరు సెక్షన్ల కింద ఉరి శిక్ష విధించిన అరుదైన కేసు ఇది. రెండు జంటలను దారుణంగా హత్య చేసిన నిందితుడిపై ఆ కోర్టు న్యాయమూర్తి బీఎస్ విజయ్‌కుమార్ ఉరిశిక్ష విధిస్తూ తీర్పు నిచ్చారు. ఆడువళ్లి నివాసి వినయ్ భట్ ఉరి శిక్షకు గురైన వ్యక్తి. దీంతో పాటు 5 ఏళ్ల కారాగార శిక్ష, అలాగే రూ.10 లక్షల జరిమానా విధించారు. మరొక నిందితుడు శ్రీధర్ భట్‌కు యావజ్జీవ కారాగారవాసం, రూ.2.10 లక్షల జరిమానా విధిస్తూ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ప్రభుత్వ న్యాయవాది తనూజా హొసమట్ ప్రభుత్వం తరపున వాదనలు వినిపించారు. రెండేళ్ల క్రితం ఫిబ్రవరి 2023లో భట్కళ తాలూకా ఆడువళ్లి ఓణిబాగిలు నివాసి శంభు భట్(70), ఆయన భార్య మాదేవి భట్(60), కుమారుడు రాఘవేంద్ర భట్(40), కోడలు కుసుమా భట్(35) హత్యకు గురయ్యారు. ఆస్తి విషయానికి సంబంధించి వినయ్‌భట్, ఆయన తండ్రి శ్రీధర్ భట్ ఈ హత్య చేసినట్లు పోలీసులు ఛార్జిషీట్ సమర్పించారు. ప్రత్యేక సాక్షులు, శాసీ్త్రయ సాక్షులతో కేసు విచారణ చేపట్టారు.
మృతులంతా ఒకే కుటుంబానికి
చెందినవారు
మరొక నిందితునికి యావజ్జీవ
కారాగారవాసం
హత్యలు ఎలా జరిగాయంటే...
ఈ హత్యలకు 8 నెలల క్రితం శంభు భట్ పెద్ద కుమారుడు వ్యాధితో మరణించారు. మృతుడి భార్య విద్యా భట్ కుటుంబ ఆస్తిలో వాటా కోసం ఘర్షణ పడ్డారు. చర్చల తర్వాత శంభు భట్ తన కోడలు విద్యకు ఆస్తిలో వాటా పంచారు. అయితే సదరు ఆస్తిని చూసుకుంటున్న విద్యా భట్ సోదరుడు హళియాళ నివాసి వినయ్‌భట్ కోపంతో రాఘవేంద్ర భట్‌ను హత్య చేశాడు. ఈ క్రమంలో అడ్డుపడిన కుసుమా భట్‌ను కూడా హత్య చేశారు. ఈ రెండు హత్యలు చూసి శంభు భట్ దంపతులు గ్రామస్తులను పిలవడానికి పారి పోతుండటంతో వారిని వెంబడించిన వినయ్ భట్ ఇంటికి కొంచెం దూరంలో శంభు భట్‌ను హత్య చేశాడు. కాగా మాదేవి భట్‌ను శ్రీధర్ భట్ హత్య చేసినట్లు విచారణలో రుజువు అయింది. హత్యలు జరిగిన వేళ రాఘవేంద్ర దంపతుల పదేళ్ల కుమారుడు పక్క ఇంట్లో ఉండగ, నాలుగేళ్ల మరో బిడ్డ ఆ సమయంలో నిద్ర పోయింది.