
హాస్యనటుడు రాకేశ్‌కు కన్నీటి వీడ్కోలు
యశవంతపుర: టీవీ షోలు, సినిమాలలో రాణిస్తూ ఉన్న వర్ధమాన హాస్యనటుడు రాకేశ్ పూజారి (33) కి సోమవారం సాయంత్రం పుట్టిన ఊరు ఉడుపిలో అంత్యక్రియలు జరిగాయి. ఆదివారం రాత్రి మంగళూరు వద్ద తన స్నేహితుని పెళ్లి వేడుకలో పాల్గొని అక్కడే కుప్పకూలి మరణించడం తెలిసిందే. కన్నడ సినీ రంగం విషాదానికి లోనైంది. ఉడుపిలో కుటుంబసభ్యులు, బంధువులు కన్నీటిపర్వతం అయ్యారు.
రాకేశ్ పాల్గొనే కామెడి కిలాడీ షోలో సహనటులు నయన, శివరాజ్ కేఆర్ పేట, అనీశ్, హీతేశ్, ప్రవీణ, వాణితో పాటు ప్రముఖ నటి రక్షిత తదితరులు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. మల్పెలో రాకేశ్ ఇంటి వద్ద జనసాగరంలా మారింది. ఒక ప్రతిభావంత నటుడిని పోగొట్టుకున్నట్లు అనేక మంది ఆవేదన చెందారు. రాకేశ్ తండ్రి ఏడాది క్రితం మృతి చెందగా, అమ్మ, చెల్లెలుతో కలిసి ఉడుపిలో ఉంటున్నారు. కుటుంబ పోషణ రాకేశ్‌పై ఉండింది. నటన ద్వారా వచ్చే డబ్బులే ఇంటికి ఆధారం. దర్శకుడు యోగరాజ్ భట్ కూడా తుది నివాళులు అర్పించారు. ఉడుపి హొడెలోని హిందు రుద్రభూమిలో భిల్లవ సంప్రదాయం ప్రకారం రాకేశ్ చితికి మామ నిప్పు పెట్టారు.