
కొత్త జంట.. బైక్ ప్రమాదం
● నవ వరుడు దుర్మరణం
మండ్య: జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నవ వరుడు మృత్యువాత పడగా, వధువు తీవ్రంగా గాయపడింది. పెళ్లింట శోకం నెలకొంది. శ్రీరంగపట్టణ తాలూకాలోని అల్లాపట్టణ గ్రామానికి చెందిన కాళేగౌడ కుమారుడు విజయ్ (28)కు, నెలమనెకి చెందిన అశ్వత్ కుమార్తె రక్షిత (20)తో ఈ నెల 1వ తేదీన వివాహమైంది. ఆదివారం ఉదయం నవ జంట ఇద్దరూ బైక్‌పై విహారానికి శింషా పర్యాటక స్థలికి వెళ్లి తిరుగు ప్రయాణమయ్యారు. సాయంత్రం కొడగహళ్లి సమీపంలో అదుపు తప్పి చెట్టును ఢీకొన్నారు. ప్రమాదంలో విజయ్ తలకు, కాలుకు, మెడకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స కోసం ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించాడు. తీవ్ర గాయాలైన రక్షితను మైసూరులోని ఆస్పత్రిలో చికిత్స కోసం చేర్పించారు. విజయ్ మృతదేహాన్ని సోమవారం మధ్యాహ్నం తాలూకాలోని అల్లాపట్టణ గ్రామానికి తీసుకొచ్చి అంత్యక్రియలు నెరవేర్చారు. కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. కాగా ఈ ఘటనపై బన్నూరు పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది.