
నేత్రపర్వం.. వడకరాయ రథోత్సవం
హొసపేటె: విజయనగర సామ్రాజ్య రాజుల కాలం నాటి చారిత్రక వడకరాయ ఆలయ రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. హొసపేటెలోని మెయిన్ బజార్‌లోని వడకరాయ ఆలయంలో జరిగిన రథోత్సవానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆలయానికి వచ్చిన భక్తులు వడకరాయ స్వామిని దర్శించుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు వడకరాయ స్వామి రథాన్ని ఆలయం వద్ద నుంచి పాదగట్టె ఆంజనేయ స్వామి ఆలయం వరకు లాగారు.
ఘనంగా మరడి దుర్గమ్మ రథోత్సవం
బుద్ధ పూర్ణిమ రోజున సోమవారం సాయంత్రం వేలాది మంది భక్తులతో మరడి దుర్గమ్మ దేవి రథోత్సవం వైభవంగా జరిగింది. రథోత్సవం ప్రారంభం కాగానే దుర్గాదేవికి మొక్కులు తీర్చుకునే భక్తులు కోళ్లను రథంపైకి విసిరి తమ భక్తిని అర్పించారు. మిగిలిన భక్తులు అరటిపండ్లు విసిరి అమ్మవారికి పూజలు చేశారు. విజయనగర జిల్లా కొట్టూరులోని బిక్కిమరడిలో దుర్గమ్మ దేవి రథోత్సవంలో మాత్రమే ప్రత్యక్షంగా కోళ్లను విసిరే సంప్రదాయం ఉంది. రథోత్సవం వీక్షించడానికి భక్తులు భారీగా తరలివచ్చి మధ్యాహ్నం నుంచే గంటల తరబడి ఎదురు చూశారు. రథోత్సవానికి ముందు దుర్గమ్మ దేవి ఉత్సవ విగ్రహాన్ని పల్లకీలో ప్రతిష్టించి, అమ్మవారి పల్లకీ ఉత్సవాన్ని శుభ వాయిద్యాల ఊరేగింపుతో తీసుకువచ్చి, రథం చుట్టూ ప్రదక్షిణ చేసి, రథంలో ప్రతిష్టించిన తరువాత రథోత్సవం నిర్వహించారు.