
క్షేమంగా వెళ్లిరా నాన్న.!
● సైనికుడికి కుటుంబ సభ్యుల వీడ్కోలు
హుబ్లీ: సాధారణ సెలవుల కోసం ఇంటికి వచ్చిన తమ సైనిక సంతానానికి ఆయా కుటుంబ సభ్యులు, ధైర్య వచనాలు బోధించి విధులకు సాగనంపారు. బెళగావి జిల్లాలోని బైలహొంగల సమీపంలో ఒకే కుమారుడు ఉన్నా తాము దేశభక్తితో ఉన్న ఒక్క కుమారుడిని దేశ సేవకు పంపించామని ఆ తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. వాస్తవంగా ఈ ఫోటోలో కనిపిస్తున్న యువజవాన్‌కు తల్లిదండ్రులు వీరతిలకం దిద్ది ఆశీర్వచనాలు అందించి విధులకు సాగనంపారు. ఆ తాలూకాలోని సిరులూరు కన్నడనాడు ఒంకుంద గ్రామంలో 21 ఏళ్ల వీరజవాన్ బసవంతప్ప రుద్రప్ప కల్లి ఆదివారం రాత్రి తాను విధులు నిర్వహించే రాజస్తాన్‌లో జైసల్మేర్‌కు పయనం అయ్యారు.
సైనిక వాహనం డ్రైవర్‌గా బసవంతప్ప
బసవంతప్ప సైనిక వాహనం డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. తండ్రి రుద్రప్ప ఒంకుంద గ్రామ పంచాయతీలో నీటి సరఫరా విభాగంలో పని చేస్తున్నారు. తల్లి నిర్మల ఆ గ్రామపంచాయతీ చైర్ పర్సన్. వీరికి ఒకే కుమారుడు. ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. బసవంతప్ప మాట్లాడుతూ ప్రస్తుతం సెలవులపై వచ్చానని అయితే తమ ఉన్నతాధికారులు ఫోన్ చేసి తక్షణమే విధులకు హాజరు కావాలని సూచించడంతో అర్ధంతరంగా సెలవులను రద్దు చేసుకొని విధులకు బయలుదేరి వెళుతున్నానన్నారు. తల్లి నిర్మలతో పాటు సోదరి నాగరత్న తదితరులు వీర జవాన్‌కు ఘనంగా హారతులు ఇచ్చి విధుల నిర్వహణకు సాగనంపారు.

క్షేమంగా వెళ్లిరా నాన్న.!