
20న లక్ష పేద కుటుంబాలకు ఇంటి పట్టాల పంపిణీ
బళ్లారిఅర్బన్: రాష్ట్రంలో రెవెన్యూ గ్రామాలుగా ప్రకటించి పూర్తిగా అమలు చేస్తున్నా కూడా ప్రయోజనం చేకూరని జనవసతి ప్రాంతాల్లోని లక్ష పేద కుటుంబాలకు పట్టా హక్కు పత్రాల ద్వారా పరిపూర్ణ రెవెన్యూ గ్రామాలుగా వాటిని తీర్చిదిద్దుతామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి కృష్ణ బైరేగౌడ పేర్కొన్నారు. రెవెన్యూ శాఖ ప్రగతి పరిశీలన సమావేశంలో పాల్గొన్న తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో శతాబ్దాల నుంచి కొన్ని తాండాల్లోని ప్రజలకు నివాసం ఉన్న దాఖలాలు కూడా లేని కారణంగా వారికి ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం లభించలేక పోయిందన్నారు. ప్రస్తుతం వాటన్నింటిని గుర్తించామన్నారు. గత కాంగ్రెస్ సర్కారు హయాంలో ఈ పథకం అమలు చేశామన్నారు. 36 వేల కుటుంబాలకు హక్కు పత్రాలు పంపిణీ చేశామన్నారు. అయితే గత బీజేపీ సర్కారు వీటి ప్రక్రియ పూర్తి చేయలేదన్నారు. 70 వేల కుటుంబాలకు బీజేపీ హయాంలో హక్కు పత్రాలు పంపిణి చేసింది. ప్రస్తుతం తమ సర్కారు హయాంలో సుమారు 1.50 లక్షల కుటుంబాలకు పట్టాల పంపిణీ పెండింగ్‌లో ఉందన్నారు. ఈ నెల 20న లక్ష కుటుంబాలకు హొసపేటెలో జరిగే సాధన సమావేశంలో హక్కు పత్రాలను పంపిణీ చేస్తామన్నారు. రాష్ట్రంలో పోడి అభియాన్, ఫౌతి అభియాన్‌లను విజయవంతంగా అమలు చేస్తున్నామన్నారు. వీటిని ఆయా జిల్లా, తాలూకా కేంద్రాల్లో విజయవంతంగా పూర్తి చేశారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 20 కోట్ల పేజీల రికార్డులను ఇప్పటికే డిజిటలీకరణ చేశామని మంత్రి అన్నారు.
రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి కృష్ణ బైరేగౌడ