
రెండు మూడురోజుల్లో గ్రేటర్ బెంగళూరు
శివాజీనగర: మరికొన్ని రోజుల్లో గ్రేటర్ బెంగళూరు అమల్లోకి రానున్నది. ఆ తరువాత పరిశుభ్రత అభియాన ద్వారా నగరంలో చెత్త తొలగించి స్వచ్ఛ బెంగళూరుకు కొత్త రూపం ఇస్తామని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తెలిపారు. సోమవారం నగరంలో పులకేశినగర అసెంబ్లీ నియోజకవర్గంలో 4 ఎంఎల్‌డీ సామర్థ్యం నీటి ట్యాంకు నిర్మాణానికి శంకుస్థాపన చేసి మాట్లాడారు. ఈ పథకం ద్వారా సుమారు 30 వేల ఇళ్లకు నీరు అందుతుందని చెప్పారు. ఈ నియోజకవర్గంలో రోడ్లకు రూ.130 కోట్లు, ఫ్లై ఓవర్‌కు రూ.43 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. గ్రేటర్ బెంగళూరు ద్వారా బెంగళూరుకు కొత్త రూపం ఇవ్వబడుతోంది. రెండు మూడు రోజుల్లో ఇది ప్రారంభమవుతుంది. ఆ తక్షణమే బెంగళూరులో స్వచ్ఛతా అభియానా చేపడతామని, ప్రజలు సహాయవాణికి కాల్ చేసిన వెంటనే చెత్తను తొలగించి శుభ్రం చేస్తారని తెలిపారు. గత బీజేపీ ప్రభుత్వంలో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశన్నంటాయి, ఆదాయం పాతాళానికి పడిపోయిందని ఆరోపించారు. కావేరి ఐదో దశ పథకం అమలులో ఉంది, బెంగళూరుకు నీటి కొరత ఉండదని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యేలు ఏ.సీ.శ్రీనివాస్, రిజ్వాన్ హర్షద్, ఎమ్మెల్సీ నాగరాజ్, ఆర్.సంపత్‌రాజ్, ప్రసన్నకుమార్ తదితరులు పాల్గొన్నారు.
రాజధానిలో స్వచ్ఛ అభియాన
డీసీఎం శివకుమార్ వెల్లడి