
అలంకరణలో బనశంకరీదేవి
బనశంకరి: భక్తులకు కొంగుబంగారమైన బనశంకరీదేవి ప్రత్యేక అలంకరణలో దర్శనమిచ్చింది. శుక్రవారం వేకువజామున ప్రధాన అర్చకులు ఏ.చంద్రమోహన్ ఆధ్వర్యంలో అమ్మవారికి అభిషేకం చేపట్టి వివిధ రకాల పుష్పాలతో విశేష అలంకరణచేసి పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి నిమ్మకాయల ప్రమిదలతో దీపారాధన చేసి మొక్కుబడులు తీర్చుకున్నారు. భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. అన్నదానం చేశారు.
రోడ్డుపైనే రీల్స్..
యువకుడి అరెస్ట్
యశవంతపుర: రీల్స్ కోసం రోడ్డుపై కుర్చీ వేసుకొని వీడియో తీస్తున్న నిందితుడిని బెంగళూరు ఎస్‌జే పార్క్ పోలీసులు అరెస్ట్ చేశారు. వాహన డ్రైవర్‌గా పని చేస్తున్న ప్రకాశ్ రీల్స్ వ్యామోహంలో ఎస్‌జే పార్క్ మొయిన్ రోడ్డుపై కుర్చీ వేసుకున్నారు. కుర్చీపై టీ తాగుతున్న మాదిరిలో ఫోజు ఇచ్చి వీడియో తీసుకున్నారు. అనంతరం రీల్స్‌ను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. బెంగళూరు కేఆర్ మార్కెట్ పోలీసు స్టేషన్ సోషల్ మీడియా వింగ్ గమనించి ఎస్‌జే పార్క్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీని అధారంగా రీల్స్ ప్రకాశ్‌పై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఈ నెల 12న తాను అక్కడ రీల్స్ చేసినట్లు విచారణలో ప్రకాశ్ ఒప్పుకున్నారు.
ప్రాణం తీసిన సూక్ష్మరుణం
శివమొగ్గ: సూక్ష్మరుణ సంస్థ సిబ్బంది వేధింపులతో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన శివమొగ్గలోని గాడికొప్ప లేఔట్‌లో జరిగింది. గాడికొప్పలో నివాసం ఉంటున్న వినోద్‌కుమార్(35) పెయింటర్‌గా పనిచేస్తున్నాడు. భార్య, తల్లి, కుమారుడితో కలిసి జీవిస్తున్నాడు. కుటుంబ అవసరాల కోసం సూక్ష్మరుణ సంస్థలో అప్పు తీసుకున్నాడు. అయితే కంతులు చెల్లించడంలో జాప్యం జరగడంతో సూక్ష్మరుణ సిబ్బంది ఇంటివద్దకు వచ్చి గొడవకు దిగారు. పరువు పోయిందనే మనోవేదనతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తుంగా నగర పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.

అలంకరణలో బనశంకరీదేవి

అలంకరణలో బనశంకరీదేవి