
అధ్వానం.. ఆర్టీసీ ప్రయాణం
సాక్షి,బళ్లారి: కళ్యాణ కర్ణాటక సారిగె పరిధిలో బళ్లారితో పాటు కళ్యాణ కర్ణాటక పరిధిలోని ఉమ్మడి బళ్లారి జిల్లాతో పాటు కొప్పళ, విజయనగర, కలబుర్గి తదితర ఏడు జిల్లాల్లో డొక్కు బస్సులతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆర్‌టీసీ బస్సుల్లో సీట్లు ఇరుకుగా ఉండటం ఓ ఇబ్బందిగా, కష్టంగా మారుతోంది. అందులోను బస్సులు మరీ అధ్వానంగా మారడంతో మరింత సమస్యగా మారిందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో సిద్దరామయ్య నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నామని సర్కార్ గొప్పలు చెప్పుకుంటోందే కాని, ఆ బస్సుల కండీషన్ ఏ విధంగా ఉందన్న దానిపై పర్యవేక్షణ లేకపోవడంతో ప్రయాణకులు ఆర్‌టీసీ బస్సుల్లో ప్రయాణం చేసేటప్పుడు నరకయాతన అనుభవిస్తున్నారు. డొక్కుగా మారడంతో పాటు బస్సుల్లో ప్రయాణికులు కూర్చొనే సీట్లు పొడవునా ఎక్కడబడితే అక్కడ బస్సులో పగుళ్లు ఇచ్చి రంధ్రాలు దర్శనం ఇస్తున్నాయి. అక్కడ రేకులు పైకి తేలడంతో కూర్చొన్న ప్రయాణికులకు గాయాలు కూడా అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
పురుషుల టికెట్లపై అధిక చార్జి
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కదా అని, వారి కుటుంబ సభ్యులు అందరూ కలిసి బస్సులో వెళితే డొక్కు బస్సులో ప్రయాణంతో పాటు పురుషులకు అధిక బస్సు ఛార్జీలు విధిస్తుండటంతో మరింత అసహనానికి గురవుతున్నారు. మహిళలకు ఉచితం కల్పించి పురుషుల నుంచి రెట్టింపు చార్జీలు వసూలు చేస్తున్నారు. మహిళల టికెట్లతో వచ్చే నష్టాన్ని పురుషుల టికెట్ నుంచి వసూలు చేస్తూ, ఆ నష్టాన్ని పూడ్చుకోవడమే తప్ప డొక్కు బస్సుల స్థానంలో కొత్త బస్సులు ఏర్పాటు చేసే దిశగా సర్కార్ యోచన చేయడం లేదని ప్రయాణికులు మండిపడుతున్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో చాలా వరకు బస్సుల్లో ప్రయాణికుల రద్దీ పెరిగి సీట్లు దొరక్క డబ్బు పెట్టి టికెట్ కొని నిలబడి వెళ్లాల్సి వస్తుండటంతో ప్రయాణికులు నానా ఇబ్బందులు పడుతున్నారు.
పేరుకే ఫస్ట్ ఎయిడ్ బాక్స్‌లు
ముఖ్యంగా బస్సుల్లో ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే ఫస్ట్ ఎయిడ్ బాక్స్‌లో ప్రథమ చికిత్సకు సంబంధించిన మందులు ఉంచాల్సిన చోట బాక్స్‌లను ఖాళీగా పెట్టారు. పేరుకు మాత్రమే ప్రథమ చికిత్స బాక్సులని బోర్డు పెట్టినా బస్సుల్లో ఆ బాక్స్‌లు ఖాళీగా దర్శనం ఇస్తున్నాయి. ఆస్పత్రికి దూరంగా ఉన్న ప్రాంతాల్లో ప్రయాణికులకు గాయాలైతే ఫస్ట్ ఎయిడ్ బాక్స్‌లో ఉండే ఆయిట్‌మెంటు కాని, నొప్పుల మాత్రలు, ఎవరికై నా బస్సుల్లో ఉన్నఫళంగా అనారోగ్య సమస్య తలెత్తితే ఫస్ట్ ఎయిడ్ బాక్స్‌లో ఏదైనా మందులు ఉంటే వాటి ద్వారా కొంత ఉపశమనం పొందేందుకు వీలవుతుంది. అయితే బస్సుల్లో ఉత్త బాక్సులు ఉంచి వాటిని పట్టించుకోకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బస్సు ఛార్జీలు ఎడాపెడా పెంచే సర్కార్ డొక్కు బస్సులను నడుపుతూ, ప్రయాణికులను ఇబ్బందులకు గురి చేస్తుండటంతో సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఇకనైనా కళ్యాణ కర్ణాటక పరిధిలో అధ్వానంగా ఉన్న బస్సుల స్థానంలో కొత్త బస్సులను ఏర్పాటు చేసి, ఫస్ట్ ఎయిడ్ బాక్స్‌ల్లో మందులు ఉంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఖాళీగా ప్రథమ చికిత్స పెట్టెలు
డొక్కు బస్సులుగా మారిన వైనం

అధ్వానం.. ఆర్టీసీ ప్రయాణం

అధ్వానం.. ఆర్టీసీ ప్రయాణం