
విద్యా సంస్థ మోసంపై ధర్నా
బళ్లారిఅర్బన్: కౌల్‌బజార్ జాగృతి నగర్‌లో బీఈడీ కోర్సులో ప్రవేశాలకు సంబంధించి పలువురు మహిళలను మోసగించినట్లు రాష్ట్ర ఏకీకరణ సమితి, సంగొళ్లి రాయణ్ణ సంఘం, అహింద సంఘం నేతలు ఆరోపించారు. గురువారం సదరు విద్యా సంస్థ ఎదుట బాధితురాలు రూప తదితరుల సమక్షంలో మీడియాకు వివరాలను వెల్లడించారు. బాధితులు బీఈడీ ప్రవేశం కోసం రాయల్ విద్యా సంస్థ కళాశాల కార్యాలయానికి వచ్చి ప్రవేశాల గురించి విచారణ చేయగా సంస్థ నిర్వాహకులు అబద్ధాలు చెప్పి అడ్మిషన్లు పూర్తయ్యాయని నమ్మబలికారన్నారు. మాయ మాటలతో మభ్య పెట్టి కొన్ని సీట్లు మిగిలి ఉన్నాయని వంచించి మహిళల నుంచి వేలాది రూపాయలను ఫీజుల రూపంలో కట్టించుకున్నారని నేతలు ఆరోపించారు. తక్షణమే సంబంధిత విద్యా శాఖ ఉన్నతాధికారులు రాయల్ విద్యా సంస్థలో జరిగిన మోసంపై అసలు నిజాలను వెలుగులోకి తెచ్చి బాధిత మహిళలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇలాంటి కళాశాలల నిర్వాహకుల తీరు వల్ల ఇతర విద్యా సంస్థలకు కూడా చెడ్డపేరు తెస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కరవే రక్షణ సేన సమితి సంస్థాపక అధ్యక్షులు టి.శేఖర్, క్రాంతివీర సంగొళ్లి రాయణ్ణ, హితరక్షణ వేదిక జిల్లాధ్యక్షుడు బట్టి ఎర్రిస్వామి, మహిళా మండలి అధ్యక్షురాలు రూప, విద్యార్థులు మంజుల, పవిత్ర, రామాంజిని, లోకేష్ తదితరులు పాల్గొన్నారు.