
సమయస్ఫూర్తితో అగ్నిప్రమాదాలకు చెక్
హొసపేటె: అగ్ని ప్రమాదాలను ధైర్యం, సమయస్ఫూర్తితో ఎదుర్కోవాలని అగ్నిమాపక అధికారి వలీ ప్రమోద్ అన్నారు. ఆయన నగరంలోని భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ జిల్లా సంస్థ, డీఏవీ పబ్లిక్ స్కూల్ సహకారంతో నిర్వహించిన వేసవి శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు. అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ధైర్యం, ఓర్పు బయటపడాలన్నారు. అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. అనంతరం వారు అగ్నిమాపక యంత్రం సహాయంతో పెద్ద మంటలను ఆర్పే ప్రదర్శనను చూపించారు. స్కౌట్ గైడ్స్ స్యయంగా అగ్నిమాపక యంత్రాలను ఎలా ఉపయోగించాలి, వాటితో మంటలను ఎలా ఆర్పాలి? అనే విషయాలపై వివరించారు. పీయూ కళాశాలలో రాష్ట్ర అవార్డు అందుకున్న గైడ్ విద్యార్థిని పూర్విని వాణిజ్య విభాగంలో రాష్ట్రంలో 6వ ర్యాంక్ సాధించినందుకు సత్కరించారు. అడ్మినిస్ట్రేటివ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ హరిప్రసాద్ ఆనెగొంది, టీఎంఏఈఎస్ అకాడమి ఆఫ్ సైన్స్ అండ్ కామర్స్ డైరెక్టర్ చంద్రశేఖర్, స్కౌట్స్ అండ్ గైడ్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి పీ.మంజునాథప్ప, డీఏవీ స్కూల్ ప్రిన్సిపాల్ ఆశుతోష్, కార్యదర్శి తిప్పేస్వామి తదితరులు పాల్గొన్నారు.