ప్లాస్టిక్‌పై ఉక్కుపాదం ఎన్నడో? | - | Sakshi
Sakshi News home page

ప్లాస్టిక్‌పై ఉక్కుపాదం ఎన్నడో?

Mar 26 2025 12:47 AM | Updated on Mar 26 2025 12:42 AM

సాక్షి, బళ్లారి: మారుతున్న కాలం, పెరుగుతున్న జనాభాకు తోడు శాస్త్ర సాంకేతిక రంగాలు కొత్తపుంతలు తొక్కుతున్న తరుణంలో ఆహారపు అలవాట్లు మారిపోయి ప్లాస్టిక్‌ వాడకం కూడా పెరిగిపోవడంతో ప్రజల ఆరోగ్యాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్లాస్టిక్‌ కవర్లు, పేపర్లను కూరగాయలు లేదా ఇతర వస్తువుల ప్యాకింగ్‌కు మాత్రమే వాడతారనుకొంటే పొరపాటు. వేడి వేడి ఇడ్లీలు తయారు చేసే సమయంలో పాత్రల్లో కూడా ప్లాస్టిక్‌ కవర్లు వేస్తున్నారు. దీంతో ప్లాస్టిక్‌లో ఉన్న కెమికల్‌, ఇతరత్రా ఆరోగ్యానికి కీడు చేసేవి నేరుగా ఇడ్లీలోకి చేరుతున్నాయి. వేడి వేడి సాంబారు, అన్నం, పప్పు ఇతరత్రాల పార్శిల్‌లో కూడా ప్లాస్టిక్‌ కవర్లు వాడుతున్నారు. ప్లాస్టిక్‌ వాడకంపై ఉక్కుపాదం మోపుతామని, ప్లాస్టిక్‌ రహిత బళ్లారి జిల్లాగా మారుస్తామని ఏళ్ల తరబడి అధికారులు, పాలకులు చెబుతున్నారే కాని ఆ దిశగా ఎలాంటి పురోగతి లేదు. దీంతో సామాన్య, మధ్య తరగతి ప్రజల ఆరోగ్యాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నా అధికారులు, పాలకులు ఊకదంపుడు ఉపన్యాసాలకే పరిమితం అవుతున్నారు. నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా విచ్చలవిడిగా హోటళ్లు, అంగళ్లలో ప్లాస్టిక్‌ వాడకం జరుగుతోంది.

పట్టించుకోని పాలికె, ఆహార శాఖల

అధికారులు

హోటళ్లలో ప్లాస్టిక్‌ వాడకాన్ని నియంత్రించడంలో మహానగర పాలికె సంబంధిత అధికారులు, ఆహార శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో పెద్ద పెద్ద హోటళ్లు మొదలుకొని పుట్‌పాత్‌ హోటళ్ల వరకు ప్లాస్టిక్‌ వాడకం రోజురోజుకు పెరిగిపోతోంది. ప్లాస్టిక్‌ కవర్లలో వేడి పదార్ధాలు వేసి పార్శిల్‌ చేయడం వల్ల పలు అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని వైద్యులు తెలియజేస్తున్నారు. వాటిని నియంత్రించడంలో అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండటంతో సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. భగభగ మండే వేడిలో ప్లాస్టిక్‌ కవర్‌లో ఉంచి ఇడ్లీ తయారు చేయడంతో మరింత అనారోగ్య సమస్య ఏర్పడుతుందని తెలిసినా కూడా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. నగరంలో ప్లాస్టిక్‌ కవర్ల వాడకాన్ని నియంత్రిస్తామని సంబంధిత అధికారులు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తుండటంతో పాటు తూతూ మంత్రంగా దాడులు నిర్వహించి చేతులు దులుపుకుంటున్నారు. హోటళ్లలో ప్లాస్టిక్‌ వాడకంతో పాటు బేకరీల్లో కూడా ఇష్టారాజ్యంగా ప్లాస్టిక్‌ వాడుతున్నారు. చిన్న చిన్న బేకరీల నుంచి పేరుగాంచిన బేకరీల వరకు వేడి వేడి బ్రెడ్లు, సమోసాలు, ఆలూ బన్లు తదితరాలను, బేకరీల్లో తయారు చేసిన వేడి వేడి ఆహార పదార్ధాలు అన్ని కూడా ముందుగానే ప్లాస్టిక్‌ కవర్లలో సిద్ధంగా ఉంచి అమ్మకాలు చేస్తుంటారు.

మామూళ్లు ముడితే చాలు అంతా ఓకే..

ఆహార శాఖ అధికారులు ప్రత్యక్షంగా చూసినా వారికి చేతులు తడిపితే చాలు అలా పరిశీలించి ఇలా వెళ్లిపోతారనే విమర్శ ఉంది. హోటళ్లతో పాటు బేకరీల్లో వేడివేడి పదార్ధాలు ఉంచి పార్శిల్‌ చేసే వారిపై ఉక్కుపాదం మోపకపోతే ప్రజల ఆరోగ్యాలపై ప్రభావం చూపుతుందని, తక్షణం హోటళ్లలో వాడే ప్లాస్టిక్‌ వినియోగంపై ఉక్కుపాదం మోపేలా అధికారులు చొరవ చూపాల్సిన అవసరం ఉంది. మహానగర పాలికె పరిధిలో ప్లాస్టిక్‌ వాడకం నిషేధిస్తామని అధికారం చేపట్టిన ఏడాది నుంచి ప్రతి ఒక్క మేయర్‌ హామీలు గుప్పిస్తున్నారే కాని ఆచరణలో మాత్రం అమలు చేయకపోవడంతో నగరంలో షరా మామూలుగానే ప్లాస్టిక్‌ వాడకం చేస్తున్నారు. అధికారులకు అంతో ఇంతో మామూళ్లు ఇచ్చి వ్యాపారులు ప్లాస్టిక్‌ అమ్మకాలు చేస్తున్నారు. ఆరోగ్యాలపై తీవ్ర ప్రభావం చూపే ప్లాస్టిక్‌ వాడకం పెద్ద ఎత్తున జరుగుతుండటంతో నగర ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక నగరాల్లోనే ప్టాస్టిక్‌ నిషేధం కాకపోతే గ్రామాలు, పట్టణాల్లో ఏస్థాయిలో అమ్మకాలు సాగిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇకనైనా సంబంధిత అధికారులు నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రామంలో ప్లాస్టిక్‌ వాడకాన్ని పక్కాగా నిషేధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఆ మహమ్మారి రోజురోజుకు

పెరుగుతున్న వైనం

హోటళ్లు, బేకరీల్లో ప్లాస్టిక్‌ కవర్లలోనే ప్యాకింగ్‌

పాత్రలో కూడా ప్లాస్టిక్‌ కవర్‌ వేసి

ఇడ్లీల తయారీ

ప్లాస్టిక్‌పై ఉక్కుపాదం ఎన్నడో? 1
1/3

ప్లాస్టిక్‌పై ఉక్కుపాదం ఎన్నడో?

ప్లాస్టిక్‌పై ఉక్కుపాదం ఎన్నడో? 2
2/3

ప్లాస్టిక్‌పై ఉక్కుపాదం ఎన్నడో?

ప్లాస్టిక్‌పై ఉక్కుపాదం ఎన్నడో? 3
3/3

ప్లాస్టిక్‌పై ఉక్కుపాదం ఎన్నడో?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement