బనశంకరి: బంగారం రేట్లు అంబరాన్ని అంటడంతో ఆశ కూడా ఎక్కువైంది. దీంతో మోసగాళ్లు ఎక్కువైపోతున్నారు. రాజులు పాలించిన ప్రదేశంలో ఇంటి నిర్మాణానికి పునాది తీస్తుండగా నిధి లభించింది, ఆ బంగారు ఇటుకను అమ్ముతామని మోసాలకు పాల్పడుతున్న ముగ్గురిని నగర సీసీబీ పోలీసులు అరెస్ట్‌చేశారు. బిహర్ కు చెందిన రబికుల్‌ఇస్లాం, ఇద్దీశ్ అలీ, అన్వర్‌హుసేన్ నిందితులు.
మోసాల పర్వం ఇలా
వీరు బెంగళూరుకు చేరుకుని పునాది తవ్వకంలో బంగారు ఇటుక దొరికిందని చెప్పి ఆశ పుట్టించేవారు. మొదట 10 గ్రాముల అసలైన బంగారం ముక్కను ఇచ్చి నమ్మకం కలిగించేవారు. చాలా తక్కువ రేటుకే బంగారం ఇస్తామని, ఈసారి డబ్బు తీసుకుని రావాలని చెప్పేవారు. ఇలా పలువురు బంగారం వ్యాపారులను సంప్రదించారు. బంగారం తీసుకోవడానికి మేము తెలిపిన స్థలానికి రావాలని తెలిపి పదేపదే లొకేషన్ మార్చేవారు. చివరికి నిర్మానుష్య ప్రదేశానికి వ్యాపారులను తీసుకెళ్లి డబ్బు తీసుకుని నకిలీ బంగారం ఇటుక ఇచ్చి పారిపోయేవారు. పలువురు బాధితులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కోరమంగలలో మరో వ్యాపారికి టోపీ వేస్తూ దొరికిపోయారు. ముగ్గురిని అరెస్ట్‌చేసి కేజీ నకిలీ బంగారం, ఒక వాహనం స్వాధీనం చేసుకున్నారు.
పలువురికి శఠగోపం
బెంగళూరులో బిహార్ ముఠా పట్టివేత