హుబ్లీ: గంజాయి సేవిస్తున్న ఓ వ్యక్తిని పాత హుబ్లీ పోలీసులు పట్టుకుని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పాతహుబ్లీ బీరబంద వీధి బానతికట్టి సర్కిల్ వద్ద గంజాయి తాగుతూ నిలబడిన ఇమామ్ హుస్సేన్ టపాల్‌ను అరెస్ట్ చేశారు. పరీక్షించగా గంజాయి తాగినట్లుగా గుర్తించారు. కాగా మరో ఘటనలో ధార్వాడకు కొరియర్ పని మీద వెళ్లిన వ్యక్తి కనిపించకుండా పోయాడు. హుబ్లీ తాలూకా ఉమ్మచిగి గ్రామానికి చెందిన రామ ప్రసాద రామగేరి (34) కనిపించకుండా పోయిన వ్యక్తి. గత సెప్టెంబర్ నుంచి ఇతడు కనిపించకుండా పోయాడని హుబ్లీ గ్రామీణ పోలీసులకు అతని బంధువులు ఫిర్యాదు చేశారు.
నేడు ఫ్రీడం పార్కులో ధర్నాకు మాత్రమే నోటీస్ జారీ
శివాజీనగర: బెళగావిలో కేఎస్‌ఆర్‌టీసీ కండక్టర్‌పై ఎంఈఎస్ దుండగులు దాడి చేయటాన్ని ఖండిస్తూ శనివారం కన్నడ సంఘాల నుంచి అఖండ కర్ణాటక బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో పలు రవాణా సంఘాలు కూడా బంద్‌కు మద్దతునిచ్చాయి. బెంగళూరులో ఫ్రీడంపార్కులో మాత్రమే ధర్నా చేయాలని రవాణా సంఘాలకు నోటీస్ జారీ చేశారు. రవాణా సంఘాలకు బెంగళూరు కమిషనర్ బీ.దయానంద్ నోటీస్ ఇచ్చారు. శనివారం బెంగళూరులోని ఫ్రీడం పార్కులో మాత్రమే ధర్నా చేయవచ్చు. ఫ్రీడం పార్కు మినహాయించి వేరే చోట ధర్నా చేసేందుకు అవకాశం లేదు. వేరే చోట ధర్నా, ఊరేగింపు చేస్తే చర్యలు తప్పవు, హైకోర్టు ఆదేశాలను అందరూ పాటించాలి. ఫ్రీడం పార్కులో మాత్రమే ధర్నాకు రవాణా సంఘాలకు నోటీస్ ఇచ్చినట్లు పోలీస్ కమిషనర్ తెలిపారు.
పోలీసుల నుంచి
జరిమానా తగదు
రాయచూరు రూరల్: నగరంలో పోలీసుల నుంచి జరిమానా వసూలు తగదని బీజేపీ నగర అధ్యక్షుడు ఊట్కూరు రాఘవేంద్ర పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ పుట్టమాదయ్యకు వినతిపత్రం సమర్పించి మాట్లాడారు. నగరంలో మహాబళేశ్వర, జాకీర్ హుసేన్ సర్కిల్, తీన్‌కందిల్, గంజి సర్కిల్ వంటి ప్రాంతాల్లో నగరంలో ట్రాఫిక్ పోలీసు వాహనదారుల నుంచి బలవంతంగా జరిమానాలు విధించడాన్ని ఖండించారు. ట్రాఫిక్ నియమాలను, హెల్మెట్‌లను గురించి వివరించకుండా బలవంతపు వసూళ్లకు తిలోదకాలు పలకాలని అన్నారు.
మార్కెట్‌లో వ్యక్తి మృతి
హుబ్లీ: ధార్వాడ మార్కెట్‌లో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన గురువారం వెలుగు చూసింది. ఇక్కడి హొసయల్లాపుర నివాసి ఈరణ్ణ పరసప్ప(40)ను మృతుడిగా గుర్తించారు. విపరీతంగా మద్యపానానికి అలవాటు పడిన ఈరణ్ణ మధ్యాహ్నం వేళ మార్కెట్‌కు వచ్చాడు. ఈ సందర్భంగా గుండెపోటుతో మార్కెట్‌లోనే కుప్పకూలి ప్రాణాలను వదిలాడు. అయితే అక్కడి స్థానికులు మద్యం మత్తులో కింద పడిపోయాడనుకున్నారు. ఎంతసేపటికీ పైకి లేవక పోవడంతో ఎట్టకేలకు పరీక్షించగా మృతి చెందినట్లుగా ధార్వాడ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
స్నేహితురాలిని కలవటానికి వెళ్లి..
● పట్టుబడిన యువకుడు
యశవంతపుర: తన స్నేహితురాలిని కలవడానికి బుర్కా ధరించి హాస్టల్‌లోకి వెళ్లిన యువకుడిని పట్టుకున్న ఘటన బెంగళూరు జ్ఞానభారతి పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. జ్ఞానభారతి కాలేజీ ఆవరణలో గురువారం రాత్రి 7 గంటలకు బుర్కా ధరించిన యువకుడు తన స్నేహితురాలిని కలవటానికి వెళ్లాడు. తక్షణం విద్యార్థినులు గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు అక్కడికి చేరుకొని యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. యువకుడిని మాలూరుకు చెందినవాడుగా పోలీసులు గుర్తించారు. విచారణలో తన స్నేహితురాలిని కలవటానికి వచ్చినట్లు పోలీసుల ముందు యువకుడు ఒప్పుకున్నాడు. అంతే కాకుండా రాత్రి సమయంలో అతడు ఉండటానికి అవకాశం ఇవ్వటంతో విద్యార్థినులు ఉంటున్న హాస్టల్‌కు వెళ్లినట్లు తెలిసింది. ఇలాంటి ఘటనలు జరుగుతుండగా ముందు జాగ్రత్తల్లో భాగంగా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. జ్ఞానభారతి పోలీసులు యువకుడిని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు.
ప్రేమ పేరుతో వేధింపులు.. యువతి ఆత్మహత్య
సాక్షి,బళ్లారి: 42 ఏళ్ల వయస్సు కలిగిన ఓ వ్యక్తి 19 ఏళ్ల వయస్సు కలిగిన ఓ యువతిని నిత్యం ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని వేధింపులకు గురి చేయడంతో జీవితంపై విరక్తి చెందిన ఆ యువతి ఆత్మహత్య చేసుకుంది. గదగ్ జిల్లా ముండరిగి తాలూకా విరుపాపుర తాండా నివాసి వందన(19) అనే యువతిని కిరణ్ కంబారి(42) అనే వ్యక్తి ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకోవాలని వేధించడంతో మనస్తాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. యువతి గదగ్ జిల్లా గిమ్స్ కళాశాలలో ప్యారా మెడికల్ విద్యనభ్యసిస్తుండగా కిరణ్ నిత్యం ప్రేమ వేధింపులకు గురి చేయడంతో ఆ యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ ఘటనపై బెటగేరి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
గంజాయి సేవిస్తున్న వ్యక్తి అరెస్ట్