ఎస్‌ఎస్‌ఎల్‌సీ పరీక్షలు ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

ఎస్‌ఎస్‌ఎల్‌సీ పరీక్షలు ప్రారంభం

Published Sat, Mar 22 2025 1:33 AM | Last Updated on Sat, Mar 22 2025 1:28 AM

సాక్షి,బళ్లారి: ఏడాది పాటు కష్టపడి, ఇష్టపడి చదివిన 10వ తరగతి విద్యార్థులకు ఎస్‌ఎస్‌ఎల్‌సీ బోర్డు పరీక్షలు ప్రారంభమయ్యాయి. శుక్రవారం ఎస్‌ఎస్‌ఎల్‌సీ పబ్లిక్‌ పరీక్షలు ప్రారంభం కావడంతో విద్యార్థులు టెన్షన్‌..టెన్షన్‌గా పరీక్ష కేంద్రాలకు తరలివచ్చారు. విద్యార్థులతో పాటు చాలా మంది వారి తల్లిదండ్రులు కూడా తొలి రోజు పరీక్ష కేంద్రాలకు తరలివచ్చి వారి పిల్లలను పరీక్ష కేంద్రాలకు పంపించారు. పరీక్ష ప్రారంభం రోజున ఆయా పరీక్ష కేంద్రాల వద్ద నంబర్లు చూసుకునేందుకు ఇబ్బంది పడ్డారు. ఆయా పాఠశాలల్లో ఓ బోర్డుపై ఉంచిన విద్యార్థుల తరగతి గదులు కేటాయింపునకు సంబంధించిన నంబర్లు చూసుకుని తమ గదులకు తరలి వెళ్లారు. సరిగ్గా 9.30 గంటలకు పరీక్ష కేంద్రాల్లోకి దాదాపుగా విద్యార్థులందరూ చేరుకున్నారు. ఆయా పాఠశాల వద్ద విద్యార్థులను అన్ని విధాలుగా పరిశీలన చేసి గదుల్లోకి పంపించారు. ప్రతి పరీక్ష కేంద్రం వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు చెందిన 23,524 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరైనట్లు విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. జిల్లాలో మొత్తం 64 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా గట్టి చర్యలు తీసుకున్నారు. విద్యార్థులు తొలి రోజు కొంత టెన్షన్‌కు గురై పరీక్షలు రాసినట్లు తెలుస్తోంది. గత రెండేళ్ల నుంచి బళ్లారి జిల్లాలో మెరుగైన ఫలితాలు సాధించక పోవడంతో ఈసారి మంచి ఫలితాలు సాధిస్తారనే నమ్మకాన్ని అధికారులు వ్యక్తం చేస్తున్నారు.

కొప్పళలో పుట్టెడు దుఃఖంతో పరీక్షకు విద్యార్థి

10వ తరగతి బోర్డు పరీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం కాగా, కొప్పళలో ఓ విద్యార్థి పరీక్ష కేంద్రానికి బాధాతప్త హృదయంతో హాజరై పరీక్ష రాశాడు. వివరాల్లోకి వెళితే.. కొప్పళ జిల్లా గంగావతి తాలూకా కెసరహట్టి గ్రామానికి చెందిన అడివయ్య స్వామి అనే విద్యార్థి స్థానికంగా ఉన్న స్వామి వివేకానంద ఇంగ్లిష్‌ మీడియం పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాడు. కొన్ని రోజుల క్రితం అడివయ్య స్వామి అనే విద్యార్థి తల్లి విజయలక్ష్మి(38) ఇంట్లో కాలు జారి పడడంతో తలకు బలమైన గాయమైంది. దీంతో ఆమెను చికిత్స కోసం హుబ్లీ ఆస్పత్రికి తరలించారు. శుక్రవారం ఉదయం ఆమె ఆస్పత్రిలో మృతి చెందింది. మరికొన్ని గంటల్లో విద్యార్థి టెన్త్‌ పరీక్షలకు హాజరు కావాల్సి ఉండగా, తల్లి మరణవార్త అందడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అనంతరం కొంతసేపటికి కోలుకున్న ఆ విద్యార్థి ఏం చేయాలో దిక్కుతోచక ఉండిపోయారు. పాఠశాల సిబ్బంది, బంధువులు వచ్చి విద్యార్థి అడివయ్యస్వామిని ఓదార్చారు. అనంతరం బాధను దిగమింగుకుని అందరు విద్యార్థుల మాదిరిగా పరీక్ష కేంద్రానికి వచ్చి పరీక్ష రాయడం విశేషం.

ప్రఽశాంతంగా పది పరీక్షలు

రాయచూరు రూరల్‌: జిల్లాలో పదో తరగతి పరీక్షలు శుక్రవారం ప్రఽశాంతంగా జరిగాయి. నీరమాన్వి ఉన్నత పాఠశాలలో జెడ్పీ సీఈఓ రాహుల్‌ తుకారాం పాండే, విద్యా శాఖాధికారి బడిగేర్‌, తాలూకా విద్యా శాఖాధికారులు చంద్రశేఖర్‌, రంగస్వామి పరీక్ష కేంద్రాలను పరిశీలించారు. జిల్లాలోని ఏడు తాలూకాల్లోని 97 కేంద్రాల్లో 33,906 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. దేవదుర్గ 15 కేంద్రాల్లో 4,660, లింగసూగూరులోని 18 కేంద్రాల్లో 6,746, మాన్విలో 18 కేంద్రాల్లో 6331, రాయచూరు తాలూకాలో 27 కేంద్రాల్లో 9912, సింధనూరు తాలూకాలో 19 కేంద్రాల్లో 6257 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, 814 మంది గైర్హాజరైనట్లు జిల్లా విద్యాశాఖాధికారి బడిగేర్‌ తెలిపారు.

టెన్షన్‌, టెన్షన్‌గా పరీక్ష కేంద్రాల్లోకి విద్యార్థులు హాజరు

పరీక్ష తొలి రోజున ప్రతి విద్యార్థికి తప్పని ఉత్కంఠ

ఎస్‌ఎస్‌ఎల్‌సీ పరీక్షలు ప్రారంభం1
1/3

ఎస్‌ఎస్‌ఎల్‌సీ పరీక్షలు ప్రారంభం

ఎస్‌ఎస్‌ఎల్‌సీ పరీక్షలు ప్రారంభం2
2/3

ఎస్‌ఎస్‌ఎల్‌సీ పరీక్షలు ప్రారంభం

ఎస్‌ఎస్‌ఎల్‌సీ పరీక్షలు ప్రారంభం3
3/3

ఎస్‌ఎస్‌ఎల్‌సీ పరీక్షలు ప్రారంభం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement