బనశంకరి: సిలికాన్ సిటీలో మండుటెండలకు నగరవాసులకు కడుపునొప్పి, శరీరంపై గుళ్లలు, జ్వరాలు, అతిసారం లాంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఆసుపత్రుల్లో చేరేవారి సంఖ్య 20 శాతం పెరిగింది. వాతావరణశాఖ ప్రకారం నగరంలో సాధారణం కంటే మూడు డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రత అధికమైంది. ఈ నెలలో చాలారోజులు గరిష్ట ఉష్ణోగ్రత 34, 35 డిగ్రీలకు చేరింది. వేడిగాలులు వీస్తుండటంతో పిల్లలు అధిక సంఖ్యలో అస్వస్థతకు గురి అవుతున్నారు. ఎర్రటి గుళ్లలు, జ్వరం, శ్వాసకోశ సమస్యలతో ఆసుపత్రులకు వెళ్లడం పెరిగింది. కలుషితనీరు, అపరిశుభ్రమైన ఆహారం భుజించడంతో కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు ఇట్టే సోకుతున్నట్లు వైద్యులు తెలిపారు. ఆరోగ్యశాఖ విశ్లేషణ ప్రకారం మార్చి మొదటి వారం నుంచి చలిజ్వరం, అతిసారం కేసులు 3 వేల వరకూ వచ్చాయి.
మండుటెండలకు గురైతే..
ఉష్ణోగ్రతలు పెరగడంతో జ్వరం, తలనొప్పి, వాపులు, వడదెబ్బ, స్పృహ కోల్పోవడం, ఆయాసం తదితర సమస్యలు నగరవాసుల్లో కనబడుతున్నాయి. విక్టోరియా, జయనగర ప్రభుత్వాసుపత్రి, ఇందిరాగాంధీ చిన్నపిల్లలు ఆసుపత్రి సహా ప్రముఖ ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లే అవుట్ పేషెంట్స్‌లో 10 శాతం కడుపునొప్పి, విషజ్వరాలు, అతిసారం, శరీరంపై పొక్కులు సమస్యలతో బాధపడేవారు ఉన్నారు. కడుపునొప్పి ఎక్కువమందిలో కనిపిస్తోంది.
నేత్ర సమస్యలు అధికం
ఎండల వల్ల కంటి సమస్యలు వస్తున్నాయి. కంటిలో నీరు, దురద, కళ్లు ఎర్రబడటం, కంటివాపులతో వైద్యుల వద్దకెళ్తున్నారు.ప్రముఖ కంటి ఆసుపత్రులైన మింటో, నారాయణ నేత్రాలయ, డాక్టర్ అగర్‌వాల్ కంటి ఆసుపత్రి, ఽఽశంకర కంటి ఆసుపత్రి, బెంగళూరు నేత్రాలయలో అవుట్‌పేషెంట్స్ 10 శాతం పెరిగారు. పిల్లల్లో చికెన్‌పాక్స్ వైరస్ ఎక్కువగా వస్తోందని రాజాజీనగర ఈఎస్‌ఐ ఆసుపత్రి చర్మరోగ డాక్టర్ ఎంఎస్ గిరీశ్ తెలిపారు. నేరుగా ఎండలో ఉండరాదు. సూర్యకిరణాలకు గురికాకుండా పిల్లలు, వృద్ధులు జాగ్రత్త పడాలి. స్వచ్ఛమైన నీటిని ఎక్కువగా తాగుతూ ఉండాలి. పండ్లను ఎక్కువగా ఆరగించాలని ఇందిరాగాంధీ చిన్నపిల్లల ఆరోగ్య సంస్థ డైరెక్టర్ డాక్టర్ సంజయ్ కేఎస్ తెలిపారు.
బెంగళూరువాసుల సతమతం
అతిసారం, జ్వరం, కంటి, చర్మ వ్యాధుల తాకిడి
ఎండల వెంటే ఆరోగ్య సమస్యలు
ఎండల వెంటే ఆరోగ్య సమస్యలు