కుమారస్వామీ జాగ్రత్త | - | Sakshi
Sakshi News home page

కుమారస్వామీ జాగ్రత్త

Published Fri, Mar 21 2025 1:37 AM | Last Updated on Fri, Mar 21 2025 1:33 AM

డీసీఎం శివకుమార్‌ ధ్వజం

దొడ్డబళ్లాపురం: కేంద్ర మంత్రి హెచ్‌డీ కుమారస్వామి, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ మధ్య మాటల యుద్ధం పతాకస్థాయికి చేరింది. కుమార ఫాంహౌస్‌లో కబ్జాల తొలగింపుతో అది ఇంకా తీవ్రమైంది. డీకే శివకుమార్‌ గురువారం విధానసౌధలో మీడియాతో మాట్లాడుతూ.. కుమారస్వామి మర్యాదగా ఉంటే సరి. లేదంటే మేమేంటో చూపిస్తాం అని హెచ్చరించారు. కుమారస్వామి మైసూరులో నాపై అనేక అసత్య ఆరోపణలు చేశారన్నారు. తనపై, భార్య, చెల్లి, తమ్మునిపై కుమారస్వామి, ఆయన తండ్రి కేసులు పెట్టారన్నారు. తనకూ, బళ్లారికి సంబంధం లేకపోయినా అక్రమ గనుల కేసులు బనాయించారన్నారు.

రామనగర పేరు మార్పు తథ్యం

రామనగర జిల్లా పేరు మార్చరాదని కుమారస్వామి కేంద్రంపై ఒత్తిడి తెచ్చి అనుమతి రాకుండా చేశారని ఆరోపించారు. అసలు జిల్లా పేరు మార్పుకు కేంద్రం అనుమతి అవసరం లేదన్నారు. రామనగరను బెంగళూరు దక్షిణ జిల్లాగా పేరు మార్చుతామని, అదెలాగో తనకు తెలుసని చెప్పారు. పెన్నార్‌ నదీ జలాల పంపకాల విషయంలో కర్ణాటకతో చర్చించబోమని తమిళనాడు మంత్రులు దురుద్దేశంతో తెలిపారు, కనుక వారితో కేంద్ర మంత్రులు కూర్చుని చర్చిస్తారన్నారు. తమ ప్రతిపాదనలను చివరి క్షణంలో సమర్పిస్తామన్నారు.

ఇద్దరు మంత్రులపై హనీట్రాప్‌ యత్నం!

విధానసభలో తీవ్ర చర్చ

విచారణ జరిపిస్తాం: హోంమంత్రి

యశవంతపుర: ఇద్దరు మంత్రులను హానీ ట్రాప్‌ చేయడానికి ప్రయత్నం జరిగిందని ఆరోపణలు వచ్చాయి, వారు ఫిర్యాదు చేస్తే ఉన్నతస్థాయి విచారణ చేయిస్తామని హోంమంత్రి పరమేశ్వర్‌ గురువారం అసెంబ్లీ సమావేశంలో తెలిపారు. నాలుగైదు రోజుల నుంచి ఓ మంత్రిని హనీ ట్రాప్‌ చేయడానికి కొందరు యత్నించినట్లు వదంతులు గుప్పుమన్నాయి. మరో మంత్రి సతీశ్‌ జార్కిహొళికి కూడా ఇదే మాదిరి వల వేయాలని చూశారని ప్రచారం సాగుతోంది. బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ యత్నాళ్‌ మాట్లాడుతూ తుమకూరుకు చెందిన మంత్రిని హనీ ట్రాప్‌ చేయాలనుకున్నారని చెప్పారు. దీనిపై మంత్రి కేఎన్‌ రాజణ్ణ స్పందిస్తూ తుమకూరు జిల్లా నుంచి తాను, హోంమంత్రి మాత్రమే ఉన్నాం. అనవసరమైన ఆరోపణలు చేయడం మంచిదికాదని అసెంబ్లీలో తెలిపారు. ఫిర్యాదు చేస్తాను. దీని వెనుక ఎవరున్నారో విచారణ చేయాలని రాజణ్ణ అన్నారు. దర్యాప్తు చేయిస్తామని హోంమంత్రి తెలిపారు.

రైతులపై ఏనుగు దాడి

మైసూరు: ట్రాక్టర్‌తో పొలం దున్నుతున్న రైతులపై అడవి ఏనుగు దాడి చేసి ఇద్దరు రైతులను గాయపరిచిన ఘటన జిల్లాలోని సరగూరు తాలూకా హలసూరు గ్రామంలో జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన పరశివనాయక (32), అతని పినతండ్రి శివణ్ణ (62) అనే ఇద్దరు, ఓ రైతు పొలం దున్నే పనిలో ఉన్నారు. సమీపంలోని నుగు అడవి నుంచి ఏనుగు పరుగున వచ్చి దాడికి దిగింది. ట్రాక్టర్‌పై ఉన్న పరశివ నాయక్‌కు, శివణ్ణకు గాయాలయ్యాయి. గ్రామస్తులు చేరుకుని వారిని కాపాడి ఆస్పత్రికి తరలించారు. నుగు అటవీ అధికారులు లక్ష్మణ్‌, కాళప్ప, అక్షయ్‌ కుమార్‌, అభిలాష్‌ తదితరులు ఘటనాస్థలిని పరిశీలించి, ఆపై బాధితులను పరామర్శించారు.

మహాబలేశ్వర తేరు

మైసూరు: చాముండిబెట్టలో గురువారం మహాబలేశ్వర స్వామి రథోత్సవం ఘనంగా సాగింది. ఉదయం 7.10 నుంచి 7.35 గంటల వరకు ఉన్న శుభలగ్నంలో రథోత్సవం జరిగింది. అంతకు ముందు మహాబలేశ్వర స్వామి దేవస్థానంలో కుమార్‌ దీక్షిత్‌ నేతృత్వంలో పంచామృత అభిషేకం, రుద్రాభిషేకాలు నిర్వహించారు. మహాబలేశ్వర స్వామి ఉత్సవ మూర్తిని తెచ్చి రథంలో కూర్చోబెట్టి మహామంగళ హారతిని నెరవేర్చారు. భక్తులు హరహర మహాదేవ అంటూ మహాబలేశ్వరునికి నినాదాలు చేస్తూ తేరును లాగారు. ప్యాలెస్‌, పోలీస్‌ బ్యాండ్‌లతో ఊరేగింపు జరిగింది. మైసూరు రాజవంశీకుడు, ఎంపీ యదువీర కృష్ణదత్త చామరాజ ఒడెయర్‌ మహాబలేశ్వరున్ని, చాముండేశ్వరి దర్శనం చేసుకున్నారు.

కుమారస్వామీ జాగ్రత్త 1
1/1

కుమారస్వామీ జాగ్రత్త

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement