శివాజీనగర: విద్యార్థి జీవితానికి దారిదీపంగా పరిగణించే ఎస్‌ఎస్‌ఎల్‌సీ (టెన్త్) పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభం అవుతున్నాయి. ఇందులో వచ్చే మార్కులే ఉన్నత విద్యకు మెట్లు అవుతాయి. అందుకే టెన్త్ పరీక్షలు అనగానే విద్యార్థులతో పాటు తల్లిదండ్రుల్లోనూ టెన్షన్ నెలకొంటుంది.
8.96 లక్షల మంది
రాష్ట్రంలో 2,818 కేంద్రాల్లో 8.96 లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. అన్ని పరీక్షా కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. గురువారమే ఉపాధ్యాయ సిబ్బంది హాల్స్‌లో నంబర్లను రాయడం తదితర పనులను పూర్తి చేశారు. మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వరకు కర్ణాటక పాఠశాల పరీక్ష, మూల్యాంకన నిర్ణయ మండలి ద్వారా ఈ పరీక్షలు జరుగుతాయి.
పకడ్బందీ చర్యలు
రాష్ట్రంలో 15,881 ఉన్నత పాఠశాలల్లో 4.61 లక్షల మంది బాలురు, 4.34 లక్షల మంది బాలికలు పరీక్ష రాయనున్నారు. పరీక్షా కేంద్రాల చుట్టూ 200 మీటర్ల దూరం నిషేధాజ్ఞలను అమలు చేస్తారు. పరిసరాల్లో జిరాక్స్ సెంటర్, ఇంటర్నెట్ సెంటర్లను మూసివేయాలి. పరీక్షా కేంద్రాల వద్ద ఎవరూ గుంపులుగా ఉండరాదు. అక్రమాలను అరికట్టేందుకు గత సంవత్సరం నుంచి ప్రతి గదిలో సీసీ కెమెరా ఏర్పాటు చేస్తున్నారు. 3 దశల్లో ఈ వెబ్ కాస్టింగ్‌ను పరిశీలిస్తూ ఉంటారు. ఎవరైనా అక్రమాలకు పాల్పడితే తక్షణమే గుర్తించి అదుపులోకి తీసుకుంటారు. పరీక్షా కేంద్రాల్లోకి సిబ్బంది కూడా మొబైల్‌ఫోన్‌లను తీసుకెళ్లరాదు. చీఫ్ సూపరింటెండెంట్ కెమెరా లేని సాధారణ మొబైల్ తీసుకెళ్లవచ్చు. సిబ్బంది, విద్యార్థులు ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులను తీసుకెళ్లటం నిషిద్ధం. విద్యార్థులు హాల్ టికెట్‌ను చూపి ఆర్టీసీ, సిటీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు.
నేటి నుంచి ఏప్రిల్ 4 వరకు
కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి
పది పరీక్షలకు సన్నద్ధం