హొసపేటె: విజయనగర జిల్లాలో పారదర్శకంగా టెన్త్ పరీక్షల నిర్వహణకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని జిల్లాధికారి ఎంఎస్ దివాకర్ తెలిపారు. బుధవారం నగరంలోని తన కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈనెల 21 నుంచి ఏప్రిల్ 4 వరకు జరగనున్న ఎస్‌ఎస్‌ఎల్‌సీ వార్షిక పరీక్షల్లో ఎలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరగకుండా గట్టి పోలీసు భద్రత కల్పించామన్నారు. నియమాలను పాటిస్తూ పరీక్షలను క్రమశిక్షణతో నిర్వహించాలని అధికారులను ఆదేశించామన్నారు. జిల్లాలో మొత్తం 71 పరీక్ష కేంద్రాల్లో తాగునీరు, మరుగుదొడ్లు తదితర మౌలిక సౌకర్యాలు కల్పించామన్నారు. ఈ సారి వార్షిక పరీక్షకు 21,429 మంది కొత్త విద్యార్థులు, 1,271 మంది రిపీటర్లు, ప్రైవేట్ అభ్యర్థులతో సహా మొత్తం 22,700 మంది విద్యార్థులు హాజరు కానున్నట్లు తెలిపారు. అన్ని పరీక్ష కేంద్రాల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. పరీక్ష కేంద్రంలోకి ఎలాంటి మొబైల్ ఫోన్లు, కాలిక్యులేటర్లు లేదా ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను తీసుకురావడాన్ని నిషేధించినట్లు తెలిపారు. డీడీపీఐ కార్యాలయ అధికారి హులిబండి, బీఈఓ చెన్నబసప్ప తదితరులు పాల్గొన్నారు.