వాణిజ్య నగరిలో రంగపంచమి జోరు | - | Sakshi
Sakshi News home page

వాణిజ్య నగరిలో రంగపంచమి జోరు

Published Wed, Mar 19 2025 1:48 AM | Last Updated on Wed, Mar 19 2025 1:47 AM

హుబ్లీ: డీజే శబ్దాల హోరు మధ్య రైన్‌ డ్యాన్స్‌తో హోలీ రంగపంచమి వేడుకలను జంట నగరాల ప్రజలు ముఖ్యంగా యువత, చిన్నారులు ఘనంగా జరుపుకున్నారు. పోలీస్‌ కమిషనర్‌ శశికుమార్‌ గత రెండు రోజుల నుంచి పంచమి నేపథ్యంలో భారీగా బందోబస్తు ఏర్పాట్లు చేసిన క్రమంలో ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు. బిన్నాళ క్రాస్‌ శక్తినగర్‌లోని మైత్రి మద్య వ్యసనపరుల పునర్వసతి కేంద్రం ఉద్యోగులు ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ నాగరాజ్‌, సీనియర్‌ ఉద్యోగి హుస్సేన్‌సాబ్‌, మంజునాథ, ఇతర సిబ్బంది హోలీ ఆచరించారు.

సుయతీంద్ర తీర్థుల పుణ్యారాధన

రాయచూరు రూరల్‌: మంత్రాలయంలో గురు రాఘవేంద్రుల పూర్వ పీఠాధిపతి సుయతీంద్ర తీర్థుల పుణ్యారాధన ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. మంగళవారం మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠంలో మూల విరాట్‌్‌కు పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థ శ్రీపాదంగల్‌ ప్రత్యేక పూజలు చేశారు. సుయతీంద్ర తీర్థుల 12వ వర్ధంతి స్మరణోత్సవ వేడుకల్లో వందలాది భక్తుల సమక్షంలో వెండి రథోత్సవం జరిపారు.

జోడు రథం నిర్మాణానికి విరాళం

హొసపేటె: మత సామరస్యానికి నిదర్శనంగా తాలూకాలోని మరియమ్మనహళ్లి పట్టణంలోని ఆరాధ్య దైవం లక్ష్మీ నారాయణ స్వామి, ఆంజనేయ స్వామి జంట రథాల నిర్మాణానికి పట్టణంలోని ముస్లిం సంఘం మంగళవారం విరాళం అందించింది. ఉభయ స్వామి వారి రథాల నిర్మాణానికి ఆలయ అభివృద్ధి కమిటీకి రూ.2,80,150 విరాళంగా అందించి ఇక్కడి ముస్లిం సమాజం కూడా చిత్తశుద్ధి చూపింది. రథాలు శిథిలావస్థకు చేరుకోవడంతో ఆలయ అభివృద్ధి కమిటీ జోడు రథాల నిర్మాణం, ఆలయ పునరుద్ధరణ చేపట్టడంతో భక్తుల నుంచి కానుకలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో స్నేహానికి, ప్రేమకు, సామరస్యానికి ప్రతీకగా ముస్లిం సమాజం చేయి చేయి కలిపింది. ఈ సందర్భంగా సంఘం నాయకులు ఎన్‌ఎస్‌ బుడేన్‌ సాబ్‌, ఆలయ అభివృద్ధి కమిటీ చిద్రీష్టేష్‌, గోవింద పరశురామ, జి.సత్యనారాయణశెట్టి, విశ్వనాథ్‌, రెడ్డి మాబుసాబ్‌, ఖాజా మోదీన్‌, హొన్నూరలీ, ఐ.పరమేశ్వరప్ప పాల్గొన్నారు.

వచనకారుల సేవలు అపారం

బళ్లారిఅర్బన్‌: భావైక్యతకు కన్నడ తత్వ వచనకారుల సేవలు అపారం అని ప్రముఖ లెక్చరర్‌ బకాడే పంపాపతి తెలిపారు. జిల్లా కన్నడ సాహిత్య పరిషత్‌, బళ్లారి రాయల్‌ విద్యా సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దివంగత సంగనకల్లు శాంతమ్మ ట్రస్ట్‌, కప్పగల్‌ నబీసాబ్‌, హొన్నూరమ్మ స్మారక కార్యక్రమాల్లో ఆయన శిషునాళ షరీఫ్‌ తత్వ పదాల్లోని భావైక్యత గురించి ప్రత్యేకంగా ప్రసంగించారు. తత్వ పదకారుల భావైక్యత ఆశయాలు నేటి కాలానికి చాలా అవసరం అన్నారు. ఆ కళాశాల ప్రిన్సిపాల్‌ ఫర్జానాబేగం మాట్లాడుతూ తమ విద్యా సంస్థ అకడమిక్‌ కార్యక్రమాలతో పాటు విద్యార్థుల మనోవికాసానికి అవసరమైన నైతిక జీవితపు బోధన ఇస్తామన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు నిర్వహించిన భావగీతాలు, వ్యాసరచన పోటీల విజేతలకు అతిథులు బహుమతులను ప్రదానం చేశారు. ప్రముఖ లెక్చరర్‌ మల్లికార్జున ప్రారంభించిన ఈ కార్యక్రమంలో ప్రముఖులు హుస్సేన్‌సాబ్‌, రాజశేఖర్‌, సిద్మల్‌ మంజునాథ్‌, కాశీనాథ్‌, ఉమాదేవి, చంద్రశేఖర్‌ ఆచారి, మంజునాథ్‌ గోవిందవాడ, దాతలు కప్పగల్‌ రసూల్‌ సాబ్‌ తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే ఆఫీసుకు బాంబు బెదిరింపు

ఓ యువకుడు అరెస్ట్‌

సాక్షి, బళ్లారి: బళ్లారి నగర ఎమ్మెల్యే నారా భరత్‌ రెడ్డి కార్యాలయంలో బాంబు పెట్టినట్లు బెదిరింపు కాల్‌ రావడం కలకలం సృష్టించింది. నగరంలోని రూపనగుడి రోడ్డులో నివాసం ఉంటున్న సంతోష్‌ అనే యువకుడు సిటీ ఎమ్మెల్యే నారా భరత్‌ రెడ్డి కార్యాలయంలో బాంబు ఉంచినట్లు సోమవారం రాత్రి వాట్సాప్‌ గ్రూప్‌లో పోస్టును ఎమ్మెల్యే మొబైల్‌కు చేరవేశాడు. దీంతో ఎమ్మెల్యే తక్షణం నగరంలోని గాంధీనగర్‌ పోలీస్‌ స్టేషన్‌కు బాంబు బెదిరింపు కాల్‌పై ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగి వాట్సాప్‌ గ్రూప్‌లో బాంబు బెదిరింపు చేసిన యువకుడిని అరెస్ట్‌ చేశారు. తాగిన మైకంలో ఎమ్మెల్యే వాట్సాప్‌ గ్రూప్‌నకు బాంబు బెదిరింపు చేసినట్లు పోలీస్‌ విచారణలో తేలింది. అయితే ఈ ఘటనను పోలీసులు సీరియస్‌గా తీసుకొని యువకుడిని మరింత లోతుగా విచారణ చేస్తున్నారు.

వాణిజ్య నగరిలో  రంగపంచమి జోరు 1
1/3

వాణిజ్య నగరిలో రంగపంచమి జోరు

వాణిజ్య నగరిలో  రంగపంచమి జోరు 2
2/3

వాణిజ్య నగరిలో రంగపంచమి జోరు

వాణిజ్య నగరిలో  రంగపంచమి జోరు 3
3/3

వాణిజ్య నగరిలో రంగపంచమి జోరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement