దొడ్డబళ్లాపురం: బెంగళూరులో అనూహ్యంగా జరిగిన ఓ ప్రమాదంలో ఇద్దరు మహిళలు దుర్మరణం చెందారు. విద్యుత్ స్తంభం విరిగిపడడంతో తీవ్ర గాయాలైన చనిపోయిన ఘటన బయప్పనహళ్లి ఠాణా పరిధిలోని సుద్దుగుంటెపాళ్యలో చోటుచేసుకుంది.
వివరాలు.. సుమతి (35), సోని (36) అనే ఇద్దరు మహిళలు సోమవారం సాయంత్రం ట్యూషన్ నుంచి తమ పిల్లలను తీసుకొస్తున్నారు. సుమతి తమిళనాడువాసి, సోని బిహార్‌వాసి, ఉపాధి కోసం కుటుంబాలతో వలస వచ్చి జీవిస్తున్నారు. రోడ్డు మరమ్మత్తులు చేస్తున్న ఓ జేసీబీ వాహనం అనుకోకుండా విద్యుత్ స్తంభాన్ని ఢీకొంది. దీంతో ఆ స్తంభం విరిగి రోడ్డు పక్కన పక్కనే నడుచుకుంటూ వెళ్తున్న ఇద్దరు మహిళలపై పడింది. సుమతి, సోని గాయాలతో మృత్యువాత పడ్డారు. ఈ ప్రమాదంలో ఇద్దరు పిల్లలకు కూడా గాయాలయ్యాయి. స్తంభం పడిపోయి గాయాలైన మహిళల వీడియోలు, ఫోటోలు వైరల్ అయ్యాయి.
అధికారులు, జేసీబీ డ్రైవర్ నిర్లక్ష్యమే..
పోలీసులు జేసీబీ డ్రైవర్ రాజుపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. మహిళలకు తలా ఇద్దరు పిల్లలు ఉన్నారు. తల్లుల మరణంతో భర్తలు, పిల్లలు కన్నీరుమున్నీరుగా విలపించారు. రోడ్డు పనులు చేసేటప్పుడు అధికారులు రక్షణ చర్యలు తీసుకోవాల్సిందని, అదేమీ లేకుండా చేయడంతో అమాయకులు బలయ్యారని కొందరు ఆరోపించారు. పని చేసేచోట బారికేడ్లు ఉంచి ప్రజలను రాకుండా చూడాల్సిందన్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. జేసీబీ డ్రైవర్ హెడ్‌ఫోన్లు పెట్టుకుని నిర్లక్ష్యంగా నడిపాడని, కొందరు కేకలు వేస్తున్నా పట్టించుకోలేదని తెలిపారు.
ఇద్దరు మహిళల దుర్మరణం
బెంగళూరులో విషాద ఘటన
జేసీబీ, కరెంటు స్తంభం.. తీశాయి ప్రాణం