రాయచూరు రూరల్: దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదన్న సామెత చందంగా గ్రామీణ ప్రాంతాల్లో సరైన వర్షాలు లేకపోవడంతో మిరప దిగుబడి తగ్గి రైతుల ముఖాల్లో కళ లేదు. కళ్యాణ కర్ణాటక ప్రాంతంలోని రాయచూరు, యాదగిరి, కొప్పళ, బీదర్, కలబుర్గి జిల్లాలు రబీ సీజన్‌లో చెదురు మదురు జల్లులతో తడిశాయి. రాయచూరు, కొప్పళ జిల్లాల్లో తుంగభద్ర నది, రాయచూరు, యాదగిరి, కలబుర్గి జిల్లాల్లో కృష్ణా నదులు ఉన్నా నీరు అందక రైతుల భూముల్లో వేసుకున్న మిరప పంట ఆశించిన మేర దిగుబడి రాలేదు. పొలంలో బోరుబావుల కింద పంటలు పండించాలంటే విద్యుత్ కోతలు అధికమయ్యాయి. రాయచూరు జిల్లాలో తుంగభద్ర, కృష్ణా నదులున్నా వ్యవసాయ పనులు లభించక దేశాటన తప్పడం లేదు. రైతులు జిల్లాలో 50 వేల ఎకరాల్లో మిరప, 86 వేల ఎకరాల్లో కంది పంటలు సాగు చేశారు. కాలువలకు నీరందక, భూములు బీళ్లుగా మారాయి. తుంగభద్ర ఎడమ కాలువ ఆయకట్టు చివరి భూములకు నీరందక మిరప పంట చేతికి అందదనే ఆందోళనతో నీటిని కడవలతో మోసి పోశారు. బ్యాడిగి రకం మిరప క్వింటాల్‌కు రూ.14 వేలు ధర, గుంటూరు మిరప క్వింటాల్ ధర రూ.12,675, ఇతర రకాలు క్వింటాల్‌కు రూ.8 వేలతో మార్కెట్‌లో విక్రయాలు జరుగుతున్నాయి.
రైతులకు శాపంగా ప్రకృతి వైపరీత్యాలు
దిక్కుతోచని స్థితిలో కళ్యాణ కర్ణాటక జిల్లాల అన్నదాతలు
మిరప ధర ఘనం.. దిగుబడి పతనం