● నాలుగు వైపులా సీసీ కెమెరాలు ఏర్పాటు
హొసపేటె: సణాపుర ప్రాంతంలోని హోమ్‌స్టే వద్ద ఇటీవల విదేశీ పర్యాటకురాలిపై అత్యాచారం, హత్య జరిగిన సంఘటనతో పోలీసులు అప్రమత్తమై తగిన భద్రత, రక్షణ చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే విదేశీయులు వెళ్లే మార్గంలో నాలుగు వైపులా చెక్‌పోస్టులు నిర్మించిన పోలీసు శాఖ ప్రస్తుతం ఆయా ప్రధాన బ్లాక్‌లకు నాలుగు వైపులా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దీంతో విదేశీయులతో పాటు పర్యాటకులకు తగిన రక్షణ కల్పించేందుకు అనుకూలం కానుంది. నిందితుల కదలికలపై నిఘా పెట్టి అక్రమాలకు తావు లేకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. నాలుగు రోజుల క్రితమే గంగావతి రూరల్ పోలీస్ స్టేషన్‌లో పీఐగా విధులు నిర్వహిస్తున్న రంగప్ప దొడ్డ ఆనెగొందిలో విదేశీయులు, పర్యాటకులను రక్షించడాన్ని సవాల్‌గా తీసుకున్నారు. కొప్పళ, విజయనగర జిల్లాల సరిహద్దుల్లో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. వీలైనంత వరకు చెక్‌పోస్టు సమీపంలో కూడా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసేందుకు కొప్పళ జిల్లా పోలీస్ యంత్రాంగం నడుం బిగించింది. సమీపంలో మాజీ ఎంపీ హెచ్‌జీ.రాములుకు చెందిన కిష్కింధ రిసార్ట్‌తో అనుసంధానించే క్రాస్ సమీపంలో కూడా సీసీ కెమెరాను ఏర్పాటు చేశారు.