శివమొగ్గ: బ్రెయిన్‌డెడ్ అయిన ఓ వ్యక్తి అవయవాలను దానం చేయడం ద్వారా మృతుని కుటుంబం పుట్టెడు దుఃఖంలోనూ మానవత చాటిన ఘటన శివమొగ్గ నగరంలో జరిగింది. వివరాలు.. కృషినగర 1వ క్రాస్ నివాసి ఎస్‌సీ రమేష్ (57) అనే వ్యక్తి ఈనెల 10న సాయంత్రం ఆకస్మికంగా స్పృహ తప్పి పడిపోయారు. ఆస్పత్రికి తీసుకెళ్లగా మెదడులో రక్తస్రావం జరిగి బ్రెయిన్‌డెడ్ అని డాక్టర్లు నిర్థారించారు. వైద్యుల అభ్యర్థన మేరకు ఆయన భార్య సవిత, కుమారుడు నిశ్చిత్, కుటుంబ సభ్యులు అవయవాల దానానికి అంగీకరించారు. ఆయన దేహం నుంచి గుండె, మూత్రపిండాలు సహా పలు ముఖ్య భాగాలను సేకరించి అవసరమైన రోగుల కోసం ఆగమేఘాల్లో తరలించారు. సోలార్ రమేష్‌గా శివమొగ్గలో పేరొందిన రమేష్ చనిపోతూ పలువురికి సాయం చేశారని బంధుమిత్రులు నివాళులు అర్పించారు.