యశవంతపుర: భూమి మీద నూకలు మిగిలి ఉంటే ఎంత పెద్ద దుర్ఘటన జరిగినా ఇట్టే బయటపడవచ్చు. లేదంటే చిన్న సైకిల్ తగిలినా హరీమనాల్సిందేనని పెద్దలు చెబుతుంటారు. అదే మాదిరిగా జరిగిందీ సంఘటన. రోడ్డుపై నిలిచి కారుపై భారీ పరిమాణంలో ఉన్న కాంక్రీటు మిక్సర్ లారీ పడిపోయింది. కారు తుక్కు తుక్కయినా అందులోని ఇద్దరు బతికి బయటపడ్డారు. బెళగావి వద్ద పూణె– బెంగళూరు హైవేలో సర్వీసు రోడ్డులో ఈ ప్రమాదం జరిగింది.
ఏమైందంటే..
వివరాలు.. ధార్వాడకు చెందిన పరప్ప బాళికాయి, నింగప్ప కొప్ప కారులో బెళగావికి వెళుతూ ఏదో కారణంతో కారును నిలిపారు. వెనుక వస్తున్న కాంక్రీటు మిక్సర్ లారీ అదుపుతప్పి కారుపై పడింది. కారు తుక్కుతుక్కయింది. బెళగావి ఎపిఎంసీ పోలీసులు క్రేన్ సాయంతో పోలీసులు, ఫైర్‌సిబ్బంది వచ్చి మొదట లారీని పక్కకు తీశారు. తరువాత కారులో ఇద్దరికి తీవ్ర గాయాలై ఉంటాయని, లేదా చనిపోయి ఉండవచ్చని భావించారు. కారు డోర్లను ఊడదీసి ఇద్దరినీ బయటకు తీయగా చిన్న చిన్న గాయాలు తప్ప ఏమీ కాకపోవడంతో అందరూ ఆశ్చర్యపోయారు. గాయపడిన వీరిని, లారీ డ్రైవర్‌ని బెళగావి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
కారు తుక్కు, ఇద్దరు సురక్షితం
బెళగావి వద్ద అనూహ్య ఘటన
కారుపై పడిన కాంక్రీటు మిక్సర్