యశవంతపుర: ప్రముఖ నటుడు, డ్యాన్స్‌మాస్టర్ ప్రభుదేవా కుటుంబసమేతంగా కుక్కే సుబ్రమణ్యస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. స్వామివారికి మహాభిషేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు, అధికారులు వారికి తగిన ఏర్పాట్లు చేశారు.
సైబర్ భద్రతకు ప్రత్యేక సంస్థ ●
● హోంమంత్రి వెల్లడి
బనశంకరి: సైబర్‌నేరాల నియంత్రణ కోసం ప్రత్యేక సంస్థను స్థాపించడానికి ప్రయత్నిస్తామని హోం శాఖ మంత్రి డాక్టర్ పరమేశ్వర్ తెలిపారు. శనివారం నగరంలోని ఓ హోటల్లో సీఐడీ డి కోడ్– 2025 పేరుతో సైబర్ సదస్సును ఆయన ప్రారంభించారు. టెక్నాలజీ పెరుగుతోంటే, భద్రతా సవాళ్లు కూడా ఉద్భవిస్తున్నాయని, వాటిని ఎదుర్కొనే వృత్తి నైపుణ్యాలను పోలీసులు అలవరచుకోవాలన్నారు. కర్ణాటక ఐటీ రంగంతో పాటు, సైబర్ నేరాల నియంత్రణలో ముందంజలో ఉందన్నారు. ఇందుకోసం పలు సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో 45 వేలమందికి సైబర్ నేరాల కట్టడి గురించి శిక్షణ ఇచ్చామని, న్యాయశాఖ సిబ్బందికి కూడా శిక్షణ ఇస్తామన్నారు. విద్యారంగంలో యూనివర్శిటీలలో సైబర్ సురక్షత పట్ల పాఠ్యాంశాలు బోధిస్తామని తెలిపారు. ప్రభుత్వం 54 సైబర్ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేసిందన్నారు. అహ్మదాబాద్ కేంద్రీయ సైబర్ యూనివర్శిటీని సందర్శించామని, ఇంతకంటే ఉన్నత సంస్థను స్థాపించి సైబర్ నేరాల అడ్డుకట్టకు జాగృతి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలు ఐటీ సంస్థల ముఖ్యులు పాల్గొని ప్రసంగించారు.
బెంగళూరుకు
డిప్యూటీ స్పీకర్ తరలింపు
శివాజీనగర: ప్రమాదానికి గురై దావణగెర ఎస్‌ఎస్ హైటెక్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న డిప్యూటీ స్పీకర్ రుద్రప్ప లమాణిని మెరుగైన చికిత్స కోసం బెంగళూరులోని ఓ కార్పొరేట్ ఆసుపత్రికి తరలించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు, కుటుంబ సభ్యులు ఏమీ చెప్పకపోవడంతో నియోజకవర్గ ప్రజలు, అభిమానులు ఆదుర్దాలో ఉన్నారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ సమావేశాలు చూసుకుని బెంగళూరు నుంచి హావేరికి వెళ్తున్నారు. చిత్రదుర్గ జిల్లా హిరియూరు తాలూకా జేజే హళ్లి వద్ద హైవే పక్కన కొబ్బరినీరు తాగేందుకు కారు దిగి రాగానే ఓ బైకిస్టు వేగంగా వచ్చి ఢీకొన్నాడు. కిందపడిన రుద్రప్ప లమాణికి తలకు, నోటి దగ్గర బలమైన గాయాలయ్యాయి. ఆయనకు హిరియూరులో చికిత్స చేసి అంబులెన్స్ ద్వారా దావణగెర ఎస్‌ఎస్ హైటెక్ ఆసుపత్రిలో చేర్చారు. శనివారం ఉదయం బెంగళూరుకు తరలించారు. ప్రస్తుతం ఆయనకు వైద్యసేవలు అందిస్తున్నారు.
బెంగళూరులో చెత్త పన్ను
దొడ్డబళ్లాపురం: బెంగళూరువాసులపై బీబీఎంపీ మరో భారం మోపనుంది. ఇకపై చెత్తపై సర్వీస్ చార్జ్ వసూలు చేయాలని పాలికె నిర్ణయించింది. ఏప్రిల్ 1 నుంచి ఈ సర్వీస్ చార్జ్ వసూలు ఉంటుందని కమిషనర్ తుషార్ గిరినాథ్ తెలిపారు. ఇది పన్ను కాదని, సర్వీస్ చార్జ్ మాత్రమేనని అన్నారు. ఆస్తి పన్నుతో కలిసి ఏడాదిలో రెండుసార్లు చెత్త సుంకాన్ని చెల్లించవచ్చన్నారు. విద్యుత్ బిల్ మాదిరిగా ప్రతి నెలా వసూలు చేయడం వీలుకాదని, అందువల్ల ఇలా నిర్ణయించామని చెప్పారు.
కుక్కేలో ప్రభుదేవా పూజలు