
మాట్లాడుతున్న నిజగుణానంద స్వామీజీ
హుబ్లీ: స్వామీజీలు రాజకీయాలకు దూరంగా ఉండాలని, మతాన్ని రాజకీయాల్లోకి లాగరాదని నిజగుణానంద స్వామీజీ హితవు పలికారు. ధార్వాడలో ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడారు. డీకే శివకుమార్ సీఎం అవుతారన్న నొణవినకెరె స్వామీజీ వ్యాఖ్యలపై స్పందించిన ఆయన లింగాయతులు మాత్రమే స్వామీజీలు కాదు, మౌల్విలు, ఫాదర్లతో పాటు ఏ మత పెద్దలు రాజకీయాల్లోకి ప్రవేశించరాదన్నారు. ధర్మం, సంస్కృతి, సంస్కారాల గురించి ప్రజలకు బోధించడమే తమ కర్తవ్యం అన్నారు. నేటి సమాజంలో సమతుల్యత లోపించిందన్నారు. మఠాధీశులు రాజకీయాల్లోకి రాకూడదనేది సత్యం అన్నారు. రాజకీయ నేతలకు స్వామీజీలు మార్గదర్శనం చేయవచ్చు కానీ స్వామీజీలు ఎప్పటికీ రాజకీయ నేతలను బుజ్జగించరాదన్నారు. స్వామీజీల సేవలను పొందినప్పుడు రాజకీయ నేతలు జాగ్రత్తగా ఉండాలన్నారు. ధార్మిక కార్యక్రమాలకు మాత్రమే వారి సేవలను వినియోగించుకోవాలన్నారు. రాజకీయ నేతలతో ఉన్నప్పుడు స్వామీజీలు కూడా జాగ్రత్తగా ఉండాలన్నారు. అన్ని పార్టీల వారు మఠాలకు వస్తారు. వారితో స్వామీజీలు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. మఠాధీశులను రాజకీయాల్లో దుర్వినియోగపరచరాదన్నారు. ఆ సోయ(ప్రజ్ఞ) నేతలకు ఉండాలన్నారు. ఏ మఠాధిపతికి ఒత్తిళ్లు ఉండరాదన్నారు.