
ధాత్రి హోమం నిర్వహిస్తున్న దృశ్యం
కోలారు: నగరంలోని కోటలో ఉన్న శృంగేరి శారదా మఠంలో ఆదివారం ధాత్రి హోమం, మహా రుద్ర యాగాన్ని భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. ధాత్రి హోమంలో భాగంగా ఉదయం శారదా దేవి ఆలయంలో విశేష పూజలను నిర్వహించారు. ధాత్రి హోమంలో శంకర మఠం, బ్రాహ్మణ సంఘం పదాధికారులు, రుత్వికులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
కేంద్ర పథకాలపై ప్రచారానికే
వికసిత్ భారత్ యాత్ర
కోలారు: కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి ప్రజలకు తెలియజేసేందుకు వికసిత్ భారత్ యాత్రను ప్రారంభించినట్లు ఎంపీ ఎస్ మునిస్వామి తెలిపారు. ఆదివారం తాలూకాలోని హోళూరులో వికసిత్ భారత సంకల్ప యాత్రను ప్రారంభించి ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామంలో మద్యం దుకాణాలను తెరుస్తోందన్నారు. చిల్లర దుకాణాల్లో కూడా మద్యం విక్రయాలు సాగుతుండడంతో యువత మద్యానికి బానిస అవుతున్నారని ఆరోపించారు. దేశాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళుతున్న ప్రధాని 2024లో మూడోసారి ప్రధాని కావడం ఖాయమన్నారు. యావత్ ప్రపంచానికి కోవిడ్ టీకాలను అందించిన ఘనత నరేంద్ర మోదీనేనన్నారు. జల్‌జీవన్ మిషన్ ద్వారా కేంద్రం కోలారు జిల్లాకు రూ.1880 కోట్లు ఇచ్చిందన్నారు. 1600 పైగా గ్రామాల్లో జల్‌జీవన్ మిషన్ పనులు సాగుతున్నాయన్నారు. పీఎం సహాయనిధి కింద జిల్లాలో 12 వేల మంది వీధి వ్యాపారులకు తలా రూ.10 వేల చొప్పున భద్రత లేని రుణాలు అందించామన్నారు. ప్రజా సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీని తిరిగి ప్రధానిని చేయాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.

కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న దృశ్యం