
అవార్డు అందుకుంటున్న రైతు రమేశ్
మైసూరు: కెప్టెన్ ఏనుగు అర్జున తుపాకీ తూటా కారణంగా చనిపోలేదని, మరో ఏనుగు దంతం గుచ్చుకోవడంతోనే మృతి చెందినట్లు వైద్యుడు డాక్టర్ రమేశ్ తెలిపారు. మైసూరు నగరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ...యసళూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో భయభ్రాంతులకు గురిచేస్తున్న ఓ అడవి ఏనుగును బంధించడానికి అర్జునను తీసుకుని వెళ్లామని, ఈ సమయంలో పొదల్లో దాక్కుని ఉన్న మరో ఏనుగు ఒక్కసారిగా అర్జునపై దాడి చేసిందని, దంతం గుచ్చుకోవడంతోనే అర్జున మృతి చెందినట్లు వైద్యుడు తెలిపారు.
అర్జునకు స్మారకం : మంత్రి ఈశ్వర్ ఖండ్రె
శివాజీనగర: ఇటీవల హాసన జిల్లా సకలేశపుర తాలూకా యసళూరులో అడవిలో అనూహ్యంగా మృతి చెందిన ఏనుగు అర్జునకు స్మారకాన్ని నిర్మిస్తామని అటవీ శాఖ మంత్రి ఈశ్వర ఖండ్రె, తెలిపారు. ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... అడవి ఏనుగుల కార్యచరణ సమయంలో ఏనుగు అర్జున మృతి చెందడం బాధగా ఉందని, పూర్తి వివరాలు తెలియాల్సి ఉందన్నారు. దసరా ఉత్సవాల్లో ఎనిమిదిసార్లు అంబారీ మోసిన అర్జున మృతి ఎంతో కలిచివేసిందన్నారు.
యువ రైతుకు అవార్డు ప్రదానం
తుమకూరు: తుమకూరు జిల్లా చిక్కనాయకనహళ్లి తాలూకా హుళియూరు సమీపంలో ఉన్న తమ్మడిహళ్లి గొల్లరగట్టికి చెందిన యువ రైతు రమేష్‌కు 2023కు సంబంధించి మహేంద్ర ట్రాక్టర్స్ ఆధ్వర్యంలో ప్రదానం చేసే మిలియనీర్ ఫార్మర్ ఆఫ్ ఇండియా అవార్డు లభించింది. జిల్లాలోని తిపటూరు తాలూకాలో 2020లో 500 క్వింటాళ్ల రాగి పంటను సాగు చేసినందుకు ఈ అవార్డును ప్రదానం చేశారు. ఇటీవలె రాజధాని ఢిల్లీలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత నుంచి ఈ అవార్డును అందుకున్నారు.
ట్రాక్టర్ ఢీకొని వృద్ధురాలు మృతి
క్రిష్ణగిరి: ఆస్పత్రికి వెళ్తున్న సమయంలో ట్రాక్టర్ ఢీకొని వృద్ధురాలు మృతి చెందిన ఘటన ఊత్తంగేరి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకొంది. వివరాలు... ఊత్తంగేరి సమీపంలోని కొమ్మపట్టి గ్రామానికి చెందిన సెవతాన్ (83) అనారోగ్యంతో ఉండగా ఆమెను ఊత్తంగేరి ఆస్పత్రికి తరలిస్తుండగా ముత్తువేడి ఆలయం వద్ద ఎదురుగా వచ్చిన ట్రాక్టర్ ఢీకొంది. తీవ్రంగా గాయపడిన వృద్ధురాలు అక్కడికక్కడే మృతి చెందారు. ఊత్తంగేరి పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నారు.