
యశవంతపుర: ఉడుపి ప్రైవేట్ నర్సింగ్ కాలేజీలో బాత్‌రూంలలో విద్యార్థినుల వీడియోలు తీసిన కేసులో మొబైల్‌ఫోన్‌లోని డేటాను తిరిగి పొందడం సాధ్యం కావడం లేదని పోలీసులు చెప్పడం అనుమానాలకు తావిస్తోంది. గతంలో బీజేపీ సర్కారు చివరిరోజుల్లో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఒక వర్గానికి చెందిన యువతి.. మరో వర్గానికి చెందిన యువతుల నగ్న వీడియోలను సేకరించి వైరల్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. బాధితులు ఫిర్యాదు చేయగానే యువతి ఫోన్‌లోని డేటాను తొలగించింది. సదరు యువతిపై కేసు నమోదు చేసి మొబైల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకుని డేటా పునరుద్ధరణ కోసం బెంగళూరు, హైదరాబాదులో ఫోరెన్సిక్ ల్యాబ్‌లకు పంపారు. కానీ రిట్రీవ్ కాలేదంటూ ఈసారి అహ్మదాబాద్‌లోని ల్యాబ్‌కు పంపారు. ఘటన జరిగి ఆరు నెలలు అవుతున్నా సాక్ష్యాలు దొరకడం లేదని పోలీసులు చెప్పడం వెనుక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిందితులను తప్పించి కేసును మూసేయాలని ఇదంతా చేస్తున్నారని ఉడుపిలోని పలు సంఘాలు ఆరోపణలు చేశాయి.
ఉడుపి వీడియోల కేసులో అహ్మదాబాద్‌కు మొబైల్‌ఫోన్