రైతులకు సహకార రంగం తోడ్పాటు | Sakshi
Sakshi News home page

రైతులకు సహకార రంగం తోడ్పాటు

Published Mon, Nov 20 2023 12:30 AM

శ్మశానాన్ని శుభ్రం చేస్తున్న దృశ్యం - Sakshi

బొమ్మనహళ్లి : సహకార రంగం తోడ్పాటుతోనే వ్యవసాయ రంగం అభివృద్ధి చెందుతుందని సహకార రత్న బమూల్‌ మాజీ అధ్యక్షుడు బీ.జీ. ఆంజినప్ప అన్నారు. ఆనేకల్‌లోని సహకార సంఘం కార్యాలయంలో రాష్ట్ర సహకార మహా మండలి, బెంగళూరు నగర జిల్లా సహకార సమాఖ్య, బెంగళూరు సహకార పాల ఉత్పత్తిదారుల సమాఖ్య ఆధ్వర్యంలో జరిగిన 70వ ఆఖిల భారత సహకార సప్తాహ సమావేశాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. సహకార రంగంలో రుణాలు తీసుకొని రైతులు పంటల సాగుకు వినియోగించుకోవాలన్నారు. బమూల్‌ అధ్యక్షుడు హెచ్‌.టి.నాగేష్‌, ఆనేకల్‌ తాలూకా వ్యవసాయ ఉత్పత్తుల విక్రయ సహకార సంఘం అధ్యక్షుడు వెంకటస్వామి, బెంగళూరు నగర జిల్లా సహకార సంఘం కోశాధికారి వెంకటేష్‌, డైరెక్టర్‌ అమరేష్‌ రెడ్డి పాల్గొన్నారు.

రెవెన్యూ విభాగంలోనే ఎక్కువ ఫిర్యాదులు

గౌరిబిదనూరు: చిక్కబళ్లాపురం జిల్లాలో నీటి ఎద్దడి నివారణకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు కలెక్టర్‌ రవీంద్ర తెలిపారు. మంచేనహళ్లి పట్టణ పంచాయతీ కార్యాలయంలో శనివారం జరిగిన జనతా దర్శన్‌లో పాల్గొని ప్రజలనుంచి అర్జీలు స్వీకరించి మాట్లాడారు. జిల్లాలో 17 గ్రామాల్లో నీటి ఎద్దడి ఉన్నట్లు గుర్తించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామన్నారు. రెవెన్యూ శాఖలో ఫిర్యాదులు ఎక్కువగా అందుతున్నాయన్నారు. వాటిని సత్వరం పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. మంచేనహళ్లిలో తాలూకా కార్యాలయం, తాలూకా పంచాయతీ కార్యాలయాలను ఏర్పాటు చేస్తున్నామని, తదుపరి దశలవారీగా ఇతర కార్యాలయాలు ఏర్పాటు చేస్తామన్నారు. అడిషనల్‌ కలెక్టర్‌ తిప్పేస్వామి పాల్గొన్నారు.

శ్మశానంలో కంపచెట్ల తొలగింపు

గౌరిబిదనూరు: తాలూకా ఆనూడి గ్రామంలో దళితులకు కేటాయించిన శ్మశానవాటికకు సరైన దారి లేకపోవడంతో జయకర్ణాటక తాలూకా అధ్యక్షుడు అరుణ్‌కుమార్‌ గతంలో తహసీల్దార్‌ దృష్టికి తీసుకెళ్లారు. శ్మశాన స్థలాన్ని సర్వే చేయాలని తహసీల్దార్‌ సిబ్బందిని ఆదేశించారు. దీంతో సర్వే సమయంలో అనుకూలంగా ఉండేందుకు చెట్లను జయకర్ణాటక నేతలు ఆదివారం జేసీబీలతో తొలగింపజేశారు.

మహిళ ఆత్మహత్య

దొడ్డబళ్లాపురం: కుటుంబ కలహాలతో మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన దేవనహళ్లి పట్టణంలో చోటుచేసుకుంది. పట్టణంలో నివాసం ఉంటున్న ఉమేష్‌ దేవిక(21) అనే మహిళను ప్రేమ వివాహం చేసుకున్నారు. కొన్ని రోజులు వారి దాంపత్య జీవితం సవ్యంగానే సాగింది. అనంతరం సంసారంలో గొడవలు వచ్చాయి. దీపావళి రోజు కూడా భర్త ఇంటికి రాలేదని దేవిక ఆవేదనకు గురైంది. ఈక్రమంలో భర్తకు వీడియో కాల్‌ చేసి మాట్లాడగా ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం నివేదికలో ఆమె గర్భిణి అని తేలింది. ఉమేష్‌ వేధింపులు తాళలేక తన చెల్లెలు ఆత్మహత్యకు పాల్పడినట్లు దేవిక సోదరుడు ఫిర్యాదు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఉమేష్‌ను అరెస్ట్‌ చేశారు.

కెనరా బ్యాంక్‌ మారథాన్‌

సాక్షి బెంగళూరు: కెనరా బ్యాంక్‌ తన మొదటి మారథాన్‌ను బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో ఆదివారం నిర్వహించింది. ఈ కార్యక్రమాన్ని కెనరా బ్యాంక్‌ ఎండీ, సీఈవో కె సత్యనారాయణ రాజుతో పాటు బ్యాంక్‌ నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ విజయ్‌ శ్రీరంగన్‌, బ్యాంక్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లు దేబాశిష్‌ ముఖర్జీ, అశోక్‌ చంద్ర, హర్దీప్‌ సింగ్‌ అహ్లువాలియా, భావేంద్ర కుమార్‌ జెండా ఊపి ప్రారంభించారు. కెనరా ఫన్‌ రన్‌ (3 కి.మీ.), కెనరా సేవింగ్స్‌ రన్‌ (5 కి.మీ.) కెనరా ప్రీమియం రన్‌ (10 కి.మీ.) అనే మూడు వేర్వేరు విభాగాల్లో 7000 మంది పోటీపడ్డారు. 10కే, 5కే విజేతలకు వరుసగా రూ.2 లక్షలు, రూ. లక్ష నగదు బహుమతిని ప్రదానం చేశారు.

కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న అంజినప్ప
1/3

కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న అంజినప్ప

అర్జీలు స్వీకరిస్తున్న జిల్లా కలెక్టర్‌ రవీంద్ర
2/3

అర్జీలు స్వీకరిస్తున్న జిల్లా కలెక్టర్‌ రవీంద్ర

విజేతలతో బ్యాంకు ప్రముఖులు
3/3

విజేతలతో బ్యాంకు ప్రముఖులు

Advertisement
 
Advertisement