
మాట్లాడుతున్న జ్యోతిబసు
కేజీఎఫ్: నియోజకవర్గ సమస్యలపై ఎమ్మెల్యే రూపా శశిధర్‌కు ఏమాత్రం అవగాహన లేదని, ఆమె నియోజకవర్గాన్ని తీవ్రంగా నిర్లక్ష్యం చేస్తున్నారని సీపీఐ నాయకుడు జ్యోతిబసు తీవ్రంగా ఆరోపించారు. సోమవారం నగరంలోని సీపీఐ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. నగరంలో అనేక సమస్యలు తాండవిస్తున్నా ఎమ్మెల్యే వారానికోసారి నగరానికి పిక్నిక్‌కు వచ్చినట్లు వచ్చి వెళుతుండడంతో ప్రజల సమస్యలు పరిష్కారం కావడం లేదన్నారు. ప్రజలు తమ గోడును చెప్పుకోడానికి ఎమ్మెల్యే అందుబాటులో ఉండటం లేదని విమర్శించారు. ఎన్నికలప్పుడు ఓట్ల కోసం నగర ప్రజల నుంచి ఇళ్ల స్థలాల కోసం అర్జీలు స్వీకరించినా నగరసభ వెబ్‌సైట్‌లో ఒక్క అర్జీ కూడా నమోదు కాలేదన్నారు. రాజీవ్ గాంధీ హౌసింగ్ బోర్డు కార్పొరేషన్ నుంచి సర్వే చేసి నగరంలో 16 వేల కుటుంబాలు నివేశన రహితంగా ఉన్నారన్నారు. వీరికి ఇంతవరకు ఇళ్ల స్థలాలు ఇవ్వలేదన్నారు. కట్టడ, కూలికార్మికుల పిల్లలకు కార్మిక శాఖ నుంచి లభిస్తున్న సహాయ ధనం, విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు, కార్మికుల పిల్లలకు వివాహ సహాయ ధనం నిధులను ప్రభుత్వం తన గ్యారెంటీల అమలు కోసం ఉపయోగించుకుంటోందన్నారు. దీంతో కార్మికులకు సౌకర్యాలు అందక వీధిన పడాల్సి వస్తోందన్నారు.