
ఊరేగింపులో జైనమునులు
మైసూరు: జైనుల దశ లక్షణ మహా పర్వం సందర్భంగా బాహుబలి కొలువుదీరిన శ్రావణ బెళగోళలో శోభాయాత్రను నిర్వహించారు. జైన మఠానికి చెందిన అభినవ చారుకీర్తి భట్టారక స్వామీజీ, మైసూరులోని భువనకీర్తి భట్టారక స్వామీజీ తదితరులు యాత్రను ప్రారంభించారు. స్వర్ణ రథంలో తీర్థంకరుల విగ్రహాలను ఉంచి మంగళవాయిద్యాలతో పురాతన బసదిల మధ్య ఊరేగింపు సాగింది.
మండ్య శివార్లలో
గజరాజుల హల్‌చల్
మండ్య: అడవిలోకి వెళ్లిన ఏనుగుల గుంపు మళ్లీ రైతుల పొలాల్లోకి వస్తూ పంటలను పాడు చేస్తున్నాయి. చిక్క మండ్య గ్రామంలో ఉన్న చెరుకు తోటల్లో కొన్ని అడవి ఏనుగులు మకాం వేశాయి. సోమవారం ఉదయం మండ్య నగరానికి అతి దగ్గరగా రామకృష్ణ టాకీస్ వెనుకభాగంలో ఉన్న పొలాల్లో ఏనుగుల మంద చొరబడింది. పుట్టస్వామి అనే రైతు పొలంలో గజరాజులు ఉండగా, వాటిని చూడడానికి పెద్దసంఖ్యలో జనం రావడంతో కోలాహలం నెలకొంది. ఇవే ఏనుగులు ఆదివారం హోసబూదనూరు వద్ద చెరుకుతోటల్లోకి రాగా అటవీ సిబ్బంది వాటిని దూరంగా అడవిలోకి మళ్లించారు. కానీ వెళ్లినట్లే వెళ్లి తిరిగి వచ్చాయి. అవే ఏనుగులు వచ్చాయా, లేక ఇది మరో ఏనుగుల గుంపా అనేది అనుమానాలున్నాయి.
