
శివమొగ్గ అల్లర్లతో రాజకీయ వేడి
శివాజీనగర: రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడుటలో ప్రభుత్వం విఫలమైందని బీజేపీ మాజీ సీఎం బసవరాజ్ బొమ్మై ఆరోపించారు. శివమొగ్గ అల్లర్లకు– పోలీస్ అధికారుల బదిలీకి సంబంధముందని అన్నారు. శివమొగ్గ అత్యంత సమస్యాత్మక నగరం, అక్కడ గతంలో అనేక గొడవలు జరిగాయి, ఈద్ మిలాద్ లాంటి ఊరేగింపులో పోలీసులు తగిన చర్యలు తీసుకోలేదని సోమవారం బెంగళూరులో ఆరోపించారు. శివమొగ్గలో మూడు పోలీస్‌స్టేషన్ల వ్యాప్తిలో గొడవలు జరిగాయి, ఆ ప్రాంతాలకు సమర్థులైన పోలీసులను నియమించాలి, కానీ స్వార్థ ప్రయోజనాలు కలిగిన వారిని నియమించారని దుయ్యబట్టారు. దీనిద్వారా సంఘ విద్రోహ శక్తులు రెచ్చిపోతున్నాయని బొమ్మై ఆరోపించారు. రాష్ట్రంలో ప్రతి జిల్లాలో క్లబ్, రియల్ ఎస్టేట్ మాఫియా చెలరేగుతోంది, దీనిని అరికట్టకపోతే ఇలాగే జరుగుతుంది, తప్పు జరిగినపుడు అధికారులను వెనుకంజ వేయకుండా బదిలీ చేయాలని డిమాండ్ చేశారు.
శివమొగ్గలో అల్లర్లు మామూలే: హోంమంత్రి
శివమొగ్గ సమస్యాత్మక ప్రాంతం కాగా, అక్కడ అల్లర్లు జరగడానికి ముందే భారీ బందోబస్తును ఏర్పాటు చేయడం వల్ల పెద్ద ప్రమాదం తప్పిందని హోం శాఖ మంత్రి జీ పరమేశ్వర్ అన్నారు. బెంగళూరులో విలేకరులతో మాట్లాడిన ఆయన, శివమొగ్గలో అవాంఛనీయ సంఘటనలను పోలీసులు నియంత్రించారు. రెండు వర్గాల నుంచి నలుగురు చొప్పున అరెస్ట్ చేశారు, ఇది కొత్తేమీ కాదు. శివమొగ్గలో ముందు నుంచి కూడా ఇలాంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఈద్ మిలాద్ ఊరేగింపులో ఏదైనా జరగవచ్చని ముందే తెలిసి భారీ భద్రతను ఏర్పాటు చేశాం, విచారణ జరుగుతోందని అని తెలిపారు.