
తపాలా కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తున్న దృశ్యం
మైసూరు: తమిళనాడుకు కావేరి నీటి విడుదలను వ్యతిరేకిస్తూ మంగళవారం మైసూరు నగరంతో పాటు వివిధ ప్రాంతాల్లో పోరాట సంస్థలు, రైతు సంఘాలు వినూత్న ధర్నా నిర్వహించారు. మంగళవారం మళ్లీ 18 రోజుల పాటు మూడు వేల కూసెక్యుల నీటిని విడుదల చేయాలని కావేరి నీటి నిర్వహణ ప్రాధికార ఆదేశించడంతో స్థానిక పోరాట సంస్థలు మండిపడుతున్నాయి.
స్టాలిన్ దిష్టిబొమ్మతో నిరసన :
బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నాలు, సామూహిక భజనలు చేస్తూ తమిళనాడుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితుల కారణంగా జలాశయాలు వెలవెలపోతున్నాయని, ఇటువంటి తరుణంలో ప్రజల జీవనాడి కావేరిలో కూడా నీరు అడుగంటిందని, ఈ సమయంలో కోర్టుల్లో సరైన వాదనలు వినిపించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వారు మండిపడ్డారు. తమిళనాడు సీఎం స్టాలిన్ దిష్టిబొమ్మతో ఆందోళనకారులు శవయాత్ర నిర్వహించారు. ఇక గందధగుడి ఫౌండేషన్ సభ్యులు కూడా ధర్నా నిర్వహించారు. మైసూరు జిల్లా పంచాయతీ కార్యాలయం వద్దకు చేరుకుని అక్కడ నిరసన వ్యక్తం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి, తమిళనాడుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
టి.నరసిపుర బంద్ విజయవంతం :
తమిళనాడుకు కావేరి నీటి విడుదలను వ్యతిరేకిస్తూ కబిని కావేరి హితరక్షణ సమితితోపాటు వివిధ పోరాట సంఘాలు, కన్నడ సంఘాలు మంగళవారం మైసూరు జిల్లాలోని టీ నరసిపుర పట్టణంలో బంద్ నిర్వహించాయి. అన్ని కార్యాలయాలు, దుకాణాలు స్వచ్ఛందంగా మూసివేసి బంద్ పాటించారుు.
మండ్యలో ఫొటోగ్రాఫర్ల ధర్నా
మండ్య: కావేరి నీటి విడుదలను వ్యతిరేకిస్తూ ఫొటోగ్రాఫర్లు మండ్య నగరంలో మంగళవారం ధర్నా నిర్వహించారు. నగరంలోని సిల్వర్ జూబ్లీ పార్కుకు చేరుకున్న వారు మానవహారం నిర్వహించి వాహనాలను అడ్డుకున్నారు. అనంతరం జిల్లా అధికారిని కలిసి వినతిపత్రం అందజేశారు.
కావేరి జలాల విడుదలపై ఆగ్రహం
సామూహిక భజనలు చేస్తూ నిరసన
వెంటనే నీటి విడుదలను నిలిపి వేయాలని డిమాండ్

కరవే స్వాభిమాని సేనె కార్యకర్తల నిరసన