
మాట్లాడుతున్న ఎస్పీ శ్రీహరిబాబు
హొసపేటె: వినాయక ఉత్సవాల నిర్వహణకు వివిధ శాఖల అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ శ్రీహరిబాబు సూచించారు. గణేష్ చతుర్ధి వేడుకలపై శనివారం తన కార్యాలయ సభామందిరంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన అధ్యక్షత వహించి మాట్లాడారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు లౌడ్‌స్పీకర్ల వినియోగానికి అనుమతి లభించిందన్నారు. పర్యావరణ పరిరక్షణ మార్గదర్శకాల ప్రకారం మట్టి వినాయకులనే ఉపయోగించాలన్నారు. గణేష్ ప్రతిష్ఠాపన, నిమజ్జనంలో ముఖ్యంగా గణేశ్ విగ్రహ ఊరేగింపులో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట భద్రత, బందోబస్తు, ఇతర ఏర్పాట్లకు కేటాయించిన అధికారులు, సిబ్బంది మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. ఊరేగింపు, నిమజ్జన సమయంలో సరైన విద్యుత్ వ్యవస్థను ఏర్పాటు చేయాలన్నారు. డిశ్చార్జ్ పాయింట్ల వద్ద భద్రతతో పాటు సీసీ కెమెరాలు, బ్యారికేడ్లను ఏర్పాటు చేయాలన్నారు. ఈసందర్భంగా సబ్ డివిజనల్ అధికారి మహ్మద్ అలీ అక్రమ్ పాటు డీఎస్పీ మంజునాథ్ తదితరులు పాల్గొన్నారు.