
వినాయక చవితి పూజలందుకోవడానికి మార్కెట్‌లో సిద్ధంగా ఉన్న బొజ్జగణపయ్య విగ్రహాలు
కోలారు: భాద్రపద మాసంలో ప్రజల నుంచి పూజలందుకోవడానికి వినాయక విగ్రహాలు నగరంలో సిద్ధంగా ఉన్నాయి. గత సంవత్సరాలతో పోలిస్తే ఈ సంవత్సరం వినాయక విగ్రహాల ధరలు గణనీయంగా పెరిగాయి. చిన్న సైజు వినాయక విగ్రహానికి కూడా రూ.500 నుంచి రూ.1000 వరకు సొమ్ము వెచ్చించాల్సి వస్తోంది. జిల్లా యంత్రాంగం పరిసరాల రక్షణ ఉద్దేశంతో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో తయారు చేసే వినాయక విగ్రహాలను పూర్తిగా నిషేధించడం వల్ల వినాయక విగ్రహాల ధరలు గణనీయంగా పెరిగిపోయాయి. కేవలం మట్టితో తయారు చేసిన వినాయక విగ్రహాలనే కొనుగోలు చేయాల్సి రావడం ధరల పెరుగుదలకు మరో కారణం. మట్టి వినాయక విగ్రహల కంటే ప్టాస్టిక్ ఆఫ్ ప్యారిస్‌తో తయారు చేయడం సులభం, పైగా ఖర్చు తక్కువ. వినాయక విగ్రహాలను తక్కువ సమయంలో ఎక్కువ విగ్రహాలను తయారు చేసే అవకాశం ఉంది.
మట్టి ప్రతిమలకు భారీ డిమాండ్
అయితే మట్టి వినాయక విగ్రహాలను తయారు చేయడం ప్టాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో తయారు చేసినంత సులువు కాదు. బంకమట్టిని కూడా కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఒక్కో విగ్రహం తయారీకి ఎక్కువ సమయం తీసువడంతో పాటు విగ్రహాలను నాణ్యతతో తయారు చేయకపోతే బీటలు వారుతాయి. బీటలు వారిన విగ్రహాలను ఎవరూ కొనుగోలు చేయరు, పూజించరు. దీని వల్ల వినాయక విగ్రహాలకు ఈ సారి భారీ డిమాండ్ ఏర్పడింది. ధరలు కూడా గణనీయంగా పెరిగాయి. ఒక అడుగు ఎత్తు చిన్న విగ్రహం కొనుగోలు చేయడానికి భారీగా ధరలు పెట్టాల్సి వస్తోంది. కాలనీలలో ప్రతిష్టించే మూడు అడుగుల విగ్రహాలకు రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది, ఇక భారీ విగ్రహాల ధరలు కూడా బాగా పెరిగి రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు ధర పెట్టి కొనాల్సి వస్తోంది.
ఉచిత వితరణలు లేవు
ఎన్నికలకు ముందు ఉచిత వినాయక విగ్రహాలను ప్రజా ప్రతినిధులు, దాతలు భారీ సంఖ్యలో కొనుగోలు చేసి వివిధ సంఘాలకు, అభిమానులకు ఉచితంగా పంచేవారు. అయితే ఈసారి ఎలాంటి ఎన్నికలు లేకపోవడం వల్ల ఉచితాలు కరువై అందరూ విపణివీధిలో వినాయక విగ్రహాలను కొనుగోలు చేయాల్సి వస్తోంది. ధరలు పెరిగినా, ఉచితాలు లేకున్నా ప్రజలు మాత్రం వినాయక విగ్రహాల కొనుగోలులో ఉత్సాహం ఎంతమాత్రం తగ్గలేదు. ఈ యేడాది గౌరి వినాయక పండుగలు రెండూ ఒకే రోజు అంటే సొమవారం రావడం వల్ల శని, ఆదివారాల్లో నగరంలో భారీ ఎత్తున గౌరి గణేష విగ్రహాలు, పూలు, పండ్లను ముందుగానే ప్రజలు కొనుగోలు జరిగే అవకాశం ఉంది.
ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడకం నిషేధం
గణనీయంగా పెరిగిన విగ్రహాల ధరలు