ఉప ముఖ్యమంత్రి పూజలు

దేవాలయంలో పూజలు చేస్తున్న 
డీకే శివకుమార్‌ దంపతులు  
 - Sakshi

దొడ్డబళ్లాపురం: మొదటిసారిగా మంత్రివర్గ సమావేశానికి హాజరయ్యేందుకు బయలుదేరిన ఉప ముఖ్యమంత్రి శుక్రవారం టెంపుల్‌ రన్‌ చేపట్టారు. కనకపుర పట్టణంలో నూతనంగా నిర్మించిన అయ్యప్పస్వామి ఆలయంలో గురువారం రాత్రి జరిగిన కుంభాభిషేకంలో డీకే శివకుమార్‌ దంపతులు పాల్గొన్నారు. అక్కడే ఎక్కువ సమయం గడిపి ప్రసాదం స్వీకరించారు. శుక్రవారం మంత్రివర్గ సమావేశం ఉన్నందున గురువారం అర్ధరాత్రి తిరిగి బెంగళూరుకు బయలుదేరారు. శనివారం ఆయన ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపేందుకు కనకపుర తాలూకాలో పర్యటించనున్నారు.

యావజ్జీవ ఖైదీకి పెరోల్‌

శివాజీనగర: యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న ఖైదీకి హైకోర్టు మూడు వారాల పెరోల్‌ ఇచ్చింది. వివరాలు... ఓ హత్య కేసులో శివప్ప బెల్లద బెంగళూరు గ్రామీణ జిల్లాలోని దేవనహళ్లి ఆరు బయలు జైలులో యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్నారు. అనారోగ్యంతో ఉన్న తన తల్లితో కొద్ది రోజులు కలిసి ఉండేందుకు అనుమతి ఇవ్వాలని జైలు అధికారులకు విన్నవించారు. అధికారులు నిరాకరించారు. దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌ను సింగిల్‌ బెంచ్‌ న్యాయమూర్తి కృష్ణ ఎస్‌ దీక్షిత్‌ విచారణ చేశారు. మరణశయ్యపై ఉన్న తల్లిని చూడటానికి బిడ్డకు హక్కు ఉందని, నిరాకరించడం సబబు కాదన్నారు. తల్లిని కలుసుకునేందుకు శివప్పకు మూడు వారాల పెరోల్‌ ఇస్తూ ఆదేశాలు జారీ చేశారు.

పాలికెకు బ్యాటరీ ఆటోలు

మైసూరు: ఐసీఐసీఐ ఫౌండేషన్‌ సంస్థ తన సామాజిక బాధ్యత నిధి ద్వారా మైసూరు మహా నగర పాలికేకు 15 బ్యాటరీ ఆటోలు అందజేసింది. శుక్రవారం పాలికె కార్యాలయంలో మేయర్‌ శివకుమార్‌కు ఐసీఐసీ ఫౌండేషన్‌ సంస్థ నిర్వాహకులు సుకేత్‌సుకుమార్‌ ఆటోలను అందజేశారు. ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరించి డంపింగ్‌ యార్డులకు తరలించేందుకు ఈ ఆటోలను వినియోగిస్తారు.

డీసీఎంకు మళ్లీ ఊరట

శివాజీనగర: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌కు మళ్లీ భారీ ఊరట లభించింది. హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన మధ్యంతర స్టే పొడిగించారు. ప్రస్తుతం న్యాయమూర్తి ఎంపీ.నాగప్రసన్న ధర్మాసనానికి కేసు బదిలీ అయ్యింది. కేసు విచారణ చేసిన న్యాయమూర్తి హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన మధ్యంతర స్టేను పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. కాగా స్టే ఎత్తివేసి విచారణకు అనుమతి ఇవ్వాలని సీబీఐ హైకోర్టులో అప్పీలు చేసిన విషయం తెలిసిందే.

డీకే సురేశ్‌పై నమోదైన కేసు కొట్టివేత

డీసీఎం డీకే శివకుమార్‌ తమ్ముడు, ఎంపీ డీకే సురేశ్‌పై నమోదైన కేసును రద్దుచేస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో నగదు పంపిణీ చేశారని ఆరోపిస్తూ అప్పట్లో డీకే సురేశ్‌పై భద్రావతి పేపర్‌ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. డీకే సురేశ్‌తో పాటు మొత్తం ఆరుగురిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. తనకు వ్యతిరేకంగా నమోదైన కేసు రద్దు చేయాలని ఆయన హైకోర్టుకు వెళ్లారు. పిటిషన్‌ను విచారణ చేసిన న్యాయమూర్తి ఎం.నాగ ప్రసన్న ఎఫ్‌ఐఆర్‌ను కొట్టి వేస్తూ ఆదేశాలు జారీ చేశారు.

న్యూస్‌రీల్‌

Read latest Karnataka News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top