ఏ చెట్టు ఎప్పుడు కూలుతుందో?

ఇటీవల బెంగళూరు నగరంలో కురిసిన వర్షాలకు నేలకూలిన వృక్షాలు 
 - Sakshi

బనశంకరి: 1980లో రాష్ట్రంలో సామాజిక అరణ్య పథకం అమల్లోకి వచ్చింది. దీంతో నగర అటవీకరణ పేరుతో బెంగళూరులో మృదువైన స్పాదోడియా, డెలోనిక్స్‌రెజిమా తదితర మొక్కలు నాటారు. ఇవి బలమైన వేర్లతో భూమిలోకి వెళ్లి భారీ వృక్షాలుగా మారకముందే అభివృద్ధి పేరుతో ఫుట్‌పాత్‌ మార్గాలను కాంక్రీటీకరణ చేశారు. దీంతో వేర్లు భూమిలోకి వెళ్లలేక పటుత్వం కోల్పోయాయి. దీనికితోడు వేర్లకు నీరు, పోషకాలు సరిగా అందక చెట్లు నిర్వీర్యం అవుతున్నాయి. ఫలితంగా గాలివానకు చెట్లు కూలిపోతున్నాయి. వర్షాకాలం ప్రారంభమైన అనంతరం చెట్లు కూలిపోయే సంఖ్య మరింత పెరుగుతుందని యుఏఎస్‌ బెంగళూరు అటవీ పరిసరవిజ్ఞాన విభాగ మాజీ చీఫ్‌ డాక్టర్‌ సీ.నాగరాజయ్య అంటున్నారు. ‘బెంగళూరులాంటి మహానగరంలో వేపచెట్లు నాటడం ఉత్తమం. వీటి వేర్లు భూమిలోపల చొచ్చుకువెళ్లడంతో పాటు వాయు కాలుష్యాన్ని తగ్గించే గుణం కూడా ఉంది. బీబీఎంపీ అప్పుడప్పుడు చెట్ల కొమ్మలు కత్తిరించడం కూడా ప్రమాదాలకు కారణం. చెట్లు ఆరోగ్యస్థితిగతి, చెట్ల గణన చేస్తే ఎన్ని చెట్లు దురవస్థలో ఉన్నాయనేది లెక్కతేలుతుంది. చెట్ల సంరక్షణ, వాటి ఎదుగుదలను పరిశీలించాలని గతంలో బీబీఎంపీకి ప్రతిపాదన అందజేశాం. కానీ ఎలాంటి స్పందనలేదు’ అని నాగరాజయ్య అంటున్నారు.

బెంగళూరు సిటీలో చిన్నపాటి గాలివానకే నేలవాలుతున్న వృక్షాలు

భీతిల్లుతున్న నగర వాసులు

రోడ్లు, ఫుట్‌పాత్‌ల కోసం పదేపదే తవ్వకాలు

భూమిలోకి చొచ్చుకెళ్లలేని వేర్లు

స్థానిక జాతుల మొక్కలు నాటాలంటున్న నిపుణులు

పట్టించుకోని పాలికె అధికారులు

ఉద్యాననగరిలో వర్షాకాలం ప్రారంభం కాగానే చిన్నపాటి గాలులకే వృక్షాలు, చెట్లుకొమ్మలు విరిగిపోతూ నగరవాసులను హడలెత్తిస్తున్నాయి. దారిలో వెళ్తున్న వాహనాలపై చెట్లు కూలి ప్రమాదాలు జరుగుతున్నాయి. వర్షంలో తడవకుండా చెట్టుకిందకు వెళ్లాలంటే జనం జంకుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు 300కు పైగా చెట్లు కూలిపోయాయి. నగరరోడ్లు కాంక్రీట్‌మయం కావడం, వేర్లలో పటుత్వం లేక వృక్షాలు కూలిపోతున్నట్లు నిపుణులు చెబుతున్నారు.

మొక్కలు నాటేటప్పుడు జాగ్రత్త వహించాలి

చెట్లు కూలిపోవడాన్ని నియంత్రించాలంటే స్థానిక పరిసరాలకు అనుగుణమైన వృక్షజాతుల మొక్కలను ఎంచుకోవాలి. మూడు అడుగుల లోతులో చెట్లు నాటాలి. ఆ స్థలంలో సిమెంటు, తారురోడ్లు వేయరాదు. మొక్కల వేర్లు నాలుగునుంచి ఐదు అడుగుల లోతులోకి వెళ్లాలి. క్రమేణా ఏడాదిలోగా రెండు అడుగుల వరకు చెట్లు పెరిగితే భారీ గాలి వర్షానికి తట్టుకునే శక్తి కలిగి ఉంటుంది. స్థానిక వృక్షజాతుల మొక్కలు నాటడంపై బీబీఎంపీ దృష్టిసారించాలి. గతంలో బీబీఎంపీకి ప్రతిపాదన అందజేశా. కానీ పాలికె దీనిపై దృష్టి సారించలేదు.

– పరిసరవాది యల్లప్పరెడ్డి

పచ్చదనం దెబ్బతింటోంది

రోడ్డు, కేబుల్‌ తదితర పనులకు పదేపదే తవ్వకాలు జరగడంతో చెట్ల వేర్లు పట్టుత్వం కోల్పోయి వృక్షాలు నేలకూలుతున్నాయి. ఫలితంగా పచ్చదనం కోల్పోయి పర్యావరణం దెబ్బతింటోంది. ఈ సమస్యలు పరిష్కరించాలంటే పదేపదే రోడ్లు తవ్వడం నిలిపివేయాలి. వాహనాల సంచార ఒత్తిడి తట్టుకునే బలమైన వేర్లు భూమిలోకి వెళ్లే విభిన్నజాతుల మొక్కలు నాటాలి

–రవీంద్రరేష్మ, వృక్షశాస్త్ర అధ్యాపకుడు

Read latest Karnataka News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top