శివాజీనగర: రాష్ట్రంలో రిజర్వేషన్ ప్రతిపాదన మళ్లీ తెరపైకి రాగా, వీరశైవ లింగాయత్ ఉప కులాలకు కేంద్ర ప్రభుత్వం ఓబీసీ రిజర్వేషన్ కల్పించాలని వందకు పైగా మఠాధిపతులు ఐక్యతతో ప్రతిపాదించి డిమాండ్ చేశారు. శుక్రవారం నగరంలోని విజయనగర బసవేశ్వర సుజ్ఞాన మంటపంలో జరిగిన రిజర్వేషన్ సమావేశంలో శ్రీశైల పీఠం జగద్గురు చన్నసిద్దరామ పండితారాధ్య స్వామి, కాశీపీఠం జగద్గురు డాక్టర్ చంద్రశేఖర్ స్వామి, విభూతీపుర మఠం మహాంతలింగ స్వామి, వీరశైవ లింగాయత్ మండలి మాజీ అధ్యక్షుడు పరమశివయ్య, న్యాయవాది గంగాధర గురుమఠ్‌తో పాటు పలువురు పాల్గొని, కేంద్ర ఓబీసీ రిజర్వేషన్‌లో అన్ని వీరశైవ లింగాయత్ అనుబంధ శాఖలను ఐక్యపరచాలని కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదన సమర్పించారు. ఆ తరువాత చెన్న సిద్దరామ పండితరాధ్య స్వామి మాట్లాడుతూ... ఓబీసీ జాబితాలో వీరశైవ లింగాయత్ సమాజపు అనుబంధ కులాలను చేర్చేందుకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు సమావేశం ఏర్పాటు చేశామని, దశాబ్దాల నుంచి తమ సామాజిక వర్గం పోరాటం చేస్తూనే ఉందని, ఇప్పటికై నా కేంద్ర ప్రభుత్వం వీరశైవ లింగాయత్ సముదాయానికి చెందిన అన్ని ఉప కులాలను ఓబీసీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేశారు.