
మాట్లాడుతున్న మహావీర్
రాయచూరు రూరల్: జిల్లాలోని ఏడు తాలూకాల్లో జల జీవన్ మిషన్(జేజేఎం) పథకంలో రూ.2500 కోట్ల నిధులను అధికారులు వృథా చేశారని మాన్వి టీపీ సభ్యుడు శివశరణప్ప జానేకల్ ఆరోపించారు. శుక్రవారం పాత్రికేయుల భవనంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. 2020–21వ సంవత్సరంలో తాగునీటి పథకాల పనులను నాసిరకంగా చేపట్టి నిధులను ఇంజనీర్లు దిగమింగారన్నారు. జెడ్పీ సీఈఓ శశిధర్‌ను బదిలీ చేయాలని, జేజేఎం పథకం ఇంజినీర్లు శశికాంత్, నాగరాజ్, ప్రభాలను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
వరుడి దారుణహత్య
హుబ్లీ: జిల్లాలోని కలఘటిగి తాలూకా జిన్నూరు గ్రామంలో ఈనెల 7న పెళ్లి పీటలు ఎక్కాల్సిన ఓ యువకుడు దారుణహత్యకు గురైన ఘటన చోటు చేసుకుంది. యువకుడు నింగప్ప బూదప్ప నవలూరు(28) అనే యువకుడు తోటలోని ఇంట్లో నిద్రపోతుండగా కళ్లల్లో కారం పొడి చల్లి గొంతు నులిమి దుండగులు చంపేశారు. నింగమ్మ తావరగేరా అనే యువతితో ఈ నెల 7న పెళ్లి నిశ్చయమైంది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసుకుంటున్నారు. ఈక్రమంలో హత్య జరగడంపై హతుడి తల్లిదండ్రులు, బంధువులు కన్నీరు మున్నీరయ్యారు. ఈ హత్యకు కారణాలు తెలియరాలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
కమిషనర్ బదిలీకి డిమాండ్
రాయచూరు రూరల్: నగరసభ కమిషనర్ గురులింగప్పను బదిలీ చేయాలని ఉస్మానియా కూరగాయల మార్కెట్ క్షేమాభివృద్ధి సంఘం అధ్యక్షుడు మహావీర్ డిమాండ్ చేశారు. శుక్రవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నగరంలో పరిశుభ్రత లోపించిందని, పౌర కార్మికులతో విధులు నిర్వహించకుండా నిర్లక్ష్యం వహించారని ఆరోపించారు.
పాఠశాలలో ఎమ్మెల్యే తనిఖీ
కృష్ణరాజపురం: బెంగళూరు గ్రామీణ జిల్లా హొసకోటె టౌన్‌లో ఉన్న కేజీ కేబీఎంఎస్ పాఠశాలను హొసకోటె ఎమ్మెల్యే శరత్‌బచ్చేగౌడ శుక్రవారం సందర్శించారు. విద్యార్థులకు ఆయన స్వీట్లు పంచి పెట్టి తరగతులను ప్రారంభించారు.
పిడుగుపాటుకు
యువకుడు మృతి
రాయచూరు రూరల్: జిల్లాలోని లింగసూగూరు తాలూకా బెండోణకు చెందిన గుడ్నేసాబ్ ముల్లర్(22) అనే యువకుడు పిడుగుపాటుకు మృతి చెందాడు. గురువారం సాయంత్రం పొలంలో పని చేస్తుండగా పిడుగులతో కూడిన వర్షం కురవడంతో పిడుగుపాటుతో మరణించినట్లు రెవిన్యూ అధికారి రామకృష్ణ తెలిపారు.

మాట్లాడుతున్న శివశరణప్ప జానేకల్

జ్యోతి వెలిగిస్తున్న ఎమ్మెల్యే శరత్‌బచ్చేగౌడ

గుడ్నేసాబ్ (ఫైల్)

నింగప్ప(ఫైల్)