హుబ్లీ: ధార్వాడ జిల్లా ఇన్‌చార్జ్ మంత్రిగిరి కోసం కాంగ్రెస్‌లో అంతర్గతంగా తీవ్ర పోటీ నెలకొందని తెలుస్తోంది. జిల్లాలో సంతోష్‌లాడ్‌కు మంత్రి పదవి లభించినా పొరుగునే ఉన్న బెళగావి జిల్లా మంత్రి లక్ష్మీ హెబ్బాళ్కర్ ఈ పదవి పట్ల చాలా ఆసక్తి చూపుతున్నారు. సీఎం సిద్దరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కారులో జిల్లాకు ఒకే ఒక్క మంత్రి పదవి లభించిన సంగతి తెలిసిందే. తీవ్ర పోటాపోటీ మద్య కలఘటిగి ఎమ్మెల్యే, బళ్లారి జిల్లా గనుల దొర సంతోష్‌లాడ్ ఈ పదవిని దక్కించుకున్న విషయం విదితమే. కాగా సంప్రదాయం ప్రకారం జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి కావాలి. అయితే మొదటి సారిగా బెళగావి జిల్లాలో మహిళా ఎమ్మెల్యే లక్ష్మీ హెబ్బాళ్కర్ ఈ పదవిపై చాలా ఉత్సాహం చూపుతున్నట్లు సమాచారం. ఆమెకు ఈ పదవి లభిస్తే పొరుగున ఉన్న హావేరి జిల్లాకు సంతోష్‌లాడ్ ఇన్‌చార్జ్ మంత్రి కావచ్చని భోగట్టా. సీఎం సిద్దరామయ్య ఆప్తుడైన సంతోష్‌లాడ్ ఎట్టి పరిస్థితిలోను జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి తప్ప వేరే జిల్లాకు వెళ్లే అవకాశాలు తక్కువేనన్న వాదన కూడా వినబడుతోంది. ఇస్తే గిస్తే ధార్వాడ జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి బాధ్యతలనే ఇవ్వాలని సంతోష్‌లాడ్ గట్టిగా పట్టుబడుతున్నట్లు వినికిడి.