
విశేఽష అలంకరణతో శ్రీ సోమేశ్వరస్వామి మూలవిరాట్
హోసూరు: హోసూరు కార్పొరేషన్ రామ్‌నగర్‌లో వెలసిన ప్రసిద్ది శ్రీ సోమేశ్వరస్వామి ఆలయంలో గురువారం రాత్రి ప్రదోష పూజలను విశేషంగా నిర్వహించారు. స్వామివారి మూలవిరాట్‌కు, నంది విగ్రహాలకు పాలు, పెరుగు, వెన్న, కొబ్బరినీరు, పన్నీర్, పసుపు, కుంకుమ, చందనం, పంచామృతాలతో విశేష అభిషేకం నిర్వహించారు. అనంతరం ఆలయంలో విశేష పూజా కార్యక్రమాలను జరిపించారు. ఈ సందర్భంగా పార్వతీసమేత శ్రీ సోమేశ్వరస్వామి ఉత్సవమూర్తులను విశేషంగా అలంకరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణ నిర్వహించారు. కార్యక్రమమంలో హోసూరు పట్టణంలోని వివిద ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకొన్నారు. భక్తులకు మహామంగళారతి, తీర్థ ప్రసాద వినియోగం జరిగింది.
కరెంటు తీగ తెగిపడి నాలుగు ఆవుల మృతి
హోసూరు: కరెంటు తీగ తెగిపడి నాలుగు పాడిఆవులు మృతి చెందాయి. ఈ ఘటన ఉద్దనపల్లి సమీపంలో శుక్రవారం ఉదయం చోటు చేసుకొంది. సూళగిరి సమీపంలోని సీభం గ్రామానికి చెందిన రైతు చిన్నమాదయ్యన్. పాడిఆవులను పోషిస్తూ జీవనం సాగిస్తున్నాడు. శుక్రవారం ఉదయం పశువులను మేతకు తీసుకెళ్లాడు. ఈ సమయంలో విద్యుత్ తీగ తెగి పశువులపై పడడంతో నాలుగు పశువులు విద్యుదాఘాతానికి గురై ఘటనా స్థలంలోనే మృతి చెందాయి. స్థానికులు ఇచ్చిన సమాచారంతో విద్యుత్ శాఖ సిబ్బంది, పోలీసులు వచ్చి పరిశీలించారు. కాగా వేల రూపాయల విలువ చేసే ఆవుల మృతితో జీవనాధారం కోల్పోయానని, తనకు పరిహారం ఇవ్వాలని బాధితుడు చిన్నమాదయ్యన్ విజ్ఞప్తి చేశారు.