
పరిశీలిస్తున్న కలెక్టర్ శరయు
హోసూరు: ద్విచక్ర వాహనాన్ని మరో ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ఓ యువకుడు మృతి చెందిన ఘటన సూళగిరి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకొంది. వివరాలు... హోసూరుకు చెందిన వసంతకుమార్ (32) ప్రైవేట్ పరిశ్రమలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. గురువారం సాయంత్రం హోసూరు– క్రిష్ణగిరి జాతీయ రహదారి కామనదొడ్డి వద్ద ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా మరో ద్విచక్ర వాహనం ఢీకొంది. తీవ్రంగా గాయపడిన వసంత్ కుమార్ ఘటన స్థలంలోనే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణానికి భూమిపూజ
క్రిష్ణగిరి: సూళగిరి సమితి పన్నపల్లి పంచాయతీ లక్ష్మీపురం గ్రామంలో ఓవర్‌హెడ్ ట్యాంకు నిర్మాణానికి శుక్రవారం యూనియన్ చైర్‌పర్సన్ లావణ్యమధు భూమిపూజ చేశారు. గ్రామంలోని నీటి ట్యాంకు శిథిలావస్థకు చేరుకోవడంతో దాని స్థానంలో 30 వేల లీటర్ల సామర్థ్యంతో రూ.16 లక్షలతో కొత్త ట్యాంక్ నిర్మాణం చేపట్టారు. బీడీవోలు గోపాలకృష్ణన్, విమల్‌రవికుమార్, ఇంజినీర్ శ్యామల, పంచాయతీ అధ్యక్షుడు మంజునాథ్‌గౌడ, యూనియన్ కౌన్సిలర్ లక్ష్మమ్మరాధాకృష్ణన్ తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధి పనుల పరిశీలన
హోసూరు: క్రిష్ణగిరి కొత్త బస్టాండు వద్ద రూ. 5.20 కోట్లతో జరుగుతున్న చిన్న చెరువు అభివృద్ధి పనులను కలెక్టర్ శరయు గురువారం పరిశీలించారు. చెరువు సుందరీకరణ, విద్యుత్ దీపాలంకరణ, పక్షుల నివాస స్థలం, పడవ వసతులు, చెరువు కట్టపై మొక్కల పెంపకం, నడక దారి తదితర పనులను పరిశీలించారు. పనులు త్వరగా పూర్తి చేయించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. మున్సిపల్ చైర్మన్ పరితానవాబ్, కమిషనర్ వాసంతి పాల్గొన్నారు.

భూమిపూజ చేస్తున్న చైర్‌పర్సన్ లావణ్యమధు