
తుమకూరు: తుమకూరు నగరంలోని సిద్దగంగ మఠంలో శుక్రవారం శిర నియోజకవర్గం ఎమ్మెల్యే టీబీ జయచంద్ర దంపతులు లింగైక్య శ్రీ శివకుమార స్వామీజీ సమాధికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మఠాధ్యక్షుడు సిద్దలింగ స్వామిని కలిసి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. కార్యక్రమంలో న్యాయవాది శివరామ్, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శశి హులికుంటె మఠ్ తదితరులు పాల్గొన్నారు.
కొప్పళ వర్సిటీ లోగో ఆవిష్కరణ
శివాజీనగర: కొప్పళ విశ్వవిద్యాలయం లోగోను రాష్ట్ర గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ శుక్రవారం రాజభవన్‌లో ఆవిష్కరించారు. కొప్పళ విశ్వవిద్యాలయ వైస్ చాన్సలర్ డాక్టర్ బీ.కే.రవి, కొడుగు వర్సిటీ వీసీ డాక్టర్ అశోక్ ఆలుర్, బాగలకోటె వర్సిటీ వీసీ డాక్టర్ దేశపాండె, చామరాజనగర వర్సిటీ వీసీ డాక్టర్ గంగాధర్, బీదర్ వర్సిటీ వీసీ డాక్టర్ బిరాదార్, హాసన్ వర్సిటీ వీసీడాక్టర్ తారానాథ్, హావేరి వర్సిటీ వీసీ డాక్టర్ సురేశ్ హెచ్.జంగమశెట్టి పాల్గొన్నారు.
నగర స్వచ్ఛతకు
సహకరించండి
మైసూరు: మైసూరు నగరాన్ని స్వచ్ఛంగా ఉంచేందుకు నగరవాసులు పాలికెతో చేతులు కలపాలని మేయర్ శివకుమార్ కోరారు. నగర పాలికె, భారతీయ గ్రాహక పంచాయతీ, విద్యారణ్య ట్రస్టు, కేఎంపీసీకే ట్రస్టు ఆధ్వర్యంలో విద్యారణ్యపురంలో శుక్రవారం ఏర్పాటు చేసిన జీవన నన్న స్వచ్ఛ నగర జాగృతి జాతా కార్యక్రమాన్ని మేయర్ ప్రారంభించి మాట్లాడారు. ప్లాస్టిక్ నిషేధానికి ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. మొక్కలు నాటి నగరంలో పచ్చదనం పెంపొందించాలన్నారు. వృథా వస్తువులను పాలికెకు అందజేస్తే అవసరమైన వారికి అందజేస్తామన్నారు.
నోట్లు మార్పించి ఇస్తామని మోసం
యశవంతపుర: రెండు వేల రూపాయల నోట్లు మార్పించి ఇస్తామని నకిలీ నోట్లతో మోసగిస్తున్న ముగ్గురిని చిక్కోడి పోలీసులు అరెస్ట్ చేశారు. మహారాష్ట్రకు చెందిన సాగర జాధవ్, అరీఫ్ సాగర, లక్ష్మణ్ నాయక్‌ను కాగవాడ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.
జీపీ కార్యాలయానికి కరెంట్ కట్
బనశంకరి: కొడగు జిల్లా కుశాలనగర తాలూకా కూడిగె గ్రామపంచాయతీకి రూ.9.91 లక్షల కరెంటు బిల్లు పెండింగ్ ఉండటంతో విద్యుత్‌శాఖ అధికారులు కనెక్షన్ కట్ చేశారు. నాలుగైదు నెలల నుంచి గ్రామపంచాయతీ విద్యుత్ బిల్లు చెల్లించలేదు. విద్యుత్ కనెక్షన్ కట్ చేయడంతో గ్రామపంచాయతీ అధికారులు చీకట్లోనే విధులు నిర్వహిస్తున్నారు. పీడీఓ కూడా మొబైల్ టార్చ్ వెలుగులో పనిచేస్తున్నారు.
గౌరవభావం పెంచుకోవాలి
చిక్కబళ్లాపురం: గురువులు, పెద్దల పట్ల గౌరవభావం పెంచుకోవాలని మండ్య విశ్వవిద్యాల యం ఉప కులపతి డాక్టర్ పుట్టరాజు అన్నారు. శుక్రవారం నగరంలోని ఎస్‌జెసిఐటీ ఇంజినీరింగ్ కళాశాల ఆడిటోరియంలో విద్యార్థులకు పట్టాలు అందజేసి మాట్లాడారు. విద్యనేర్చిన పాఠశాలను జీవితాంతం గుర్తుంచుకోవాలని అన్నారు. కార్యక్రమంలో ఆదిచుంచనగిరి ట్రస్ట్ అధ్యక్షుడు శ్రీ నిర్మలానందనాథస్వామీజీ, పూజ్య మంగళానందనాథస్వామీజీ, పాలక మండలి అధికారి డాక్టర్ ఎన్ శివరామరెడ్డి, డాక్టర్ కెపి శ్రీనివాసమూర్తి తదితరులు పాల్గొన్నారు.
బెస్కాం కార్యాలయాన్ని
సందర్శించిన మంత్రి
కృష్ణరాజపురం: ఇంధన శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కేజే.జార్జ్ శుక్రవారం తొలిసారిగా నగరంలోని కేఆర్ సర్కిల్ వద్ద ఉన్న బెస్కాం క్యార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా బెస్కాం ఎండీ మహాంతేష్, బిళగి, డైరెక్టర్ దర్సన్ జై, టెక్నికల్ విభాగం అధికారి రమేష్, ఇతర అధికారులు మంత్రికి పుష్పగుచ్ఛాలు అందజేసి ఘనంగా స్వాగతం పలికారు.


జాతాను ప్రారంభిస్తున్న మేయర్ శివకుమార్
