అన్న కుమారుడి హత్య

తాగిన మత్తులో పినతండ్రి దారుణం

యశవంతపుర: సొంత అన్న కుమారుడిని పినతండ్రి దారుణంగా హత్య చేసిన ఘటన కెంగేరి హొయ్సళ సర్కిల్లో జరిగింది. వివరాలు...నవీన్‌ (32), కుమార్‌కు సొంత అన్న కుమారుడు. తాగిన సమయంలో తనకు మర్యాద ఇవ్వలేదనే కక్షతో నవీన్‌పై కుమార్‌ కక్ష పెంచుకున్నాడు. గురువారం రాత్రి కెంగేరి ఉపనగర సమీపంలోని ఓ బార్‌కు తీసుకెళ్లి మద్యం తాపించాడు. అనంతరం బార్‌ పక్కకు తీసుకెళ్లి దారుణంగా హత్య చేశాడు. పశ్చిమ విభాగం డీసీపీ లక్షణ్‌ నింబరగి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

కార్మికుడి మృతి

యశవంతపుర: ఇంటి పైనుంచి జారిపడి కార్మికుడు మృతి చెందిన ఘటన కడబలో శుక్రవారం జరిగింది. మృతుడిని అలంకారు గ్రామానికి చెందిన శరవూరు పద్మనాభ కుమారుడు హరిప్రసాద్‌గా గుర్తించారు. పట్టణంలోని మేరోంజిలో నిర్మాణంలో ఉన్న ఇంటి పైనుంచి జారి పడ్డారు. తీవ్రంగా గాయపడిన ప్రసాద్‌ను ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందు తూ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.

నలుగురి అరెస్ట్‌

యశవంతపుర: మంగళూరు సోమేశ్వర బీచ్‌లో విద్యార్థులపై దాడికి పాల్పడిన నలుగురిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. మంగళూరులోని ప్రైవేట్‌ విద్యాసంస్థలో చదువుతున్న ఆరుగురు విద్యార్థులు బీచ్‌కు వెళ్లారు. యువతులతో ఉన్నవారు ముస్లిం సముదాయానికి చెందినవారనే ఉద్దేశంతో కొందరు వెంబడించి దౌర్జన్యం చేశారు. దాడిలో గాయపడిన విద్యార్థులను దేరళకట్టె ఆస్పత్రికి తరలించారు. నలుగురిని అరెస్ట్‌ చేశారు.

రుద్రభూమి ప్రారంభం

తుమకూరు: తుమకూరు నగరంలో వీరశైవ సమాజ సేవా సమితి ఆధ్వర్యంలో తుమకూరు నగరంలోని గంగసంద్ర గ్రామంలో కొత్తగా నిర్మాణం చేసిన వీరశైవ లింగాయత్‌ రుద్రభూమిని శ్రీ సిద్దేశ్వర స్వామి, అటవీ సక్షేత్ర అటవీ శివలింగ స్వామిజీ హిరెమఠానికి చెందిన శివానంద శివాచార్య స్వామిజీ, మాకనహళి జంగమ మఠానికి చెందిన గంగాధర స్వామీజీ, సిద్దరబెట్టకు చెందిన వీరభద్ర శివాచార్య స్వామీజీ ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీ జీఎస్‌ బసవరాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

రచయిత జయప్రకాశ్‌కు

బెదిరింపు లేఖ

దొడ్డబళ్లాపురం: రచయిత బంజగెరె జయప్రకాశ్‌కు అపరిచితుల నుండి బెదిరింపు లేఖ వచ్చింది. ఇందుకు సంబంధించి ఆయన లేఖను హారోహళ్లి పోలీసులకు అంందజేసి ఫిర్యాదు చేసారు. రాష్ట్రంలో హిందూ వ్యతిరేక పార్టీ ప్రభుత్వం ఏర్పడిందని, ఇది హిందువులకు కష్టకాలమని, మీ లాంటి దేశ ద్రోహులకు, ముస్లిం, క్రిస్టియన్‌ ప్రియులకు అంత్యకాలం సమీపించిందని రాసి ఉంది. చివరిలో జై హిందూ దేశం అని రాశారు.

Read latest Karnataka News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top