లంచగొండి ఉద్యోగి అరెస్టు

- - Sakshi

మండ్య: లంచం తీసుకుంటూ గ్రామ పంచాయతీ కార్యదర్శి లోకాయుక్తకు చిక్కాడు. మండ్య తాలూకా బేలూరు గ్రామ పంచాయతీ కార్యదర్శి (గ్రేడ్‌–1) దయానంద (54) అనే వ్యక్తి లంచం తీసుకుంటు పట్టుబడ్డాడు. మండ్య శ్రీరామ లేఔట్‌కు చెందిన మంజునాథ్‌ అనే వ్యక్తి కొంత స్థలాన్ని కొనుగోలు చేశాడు. తన భార్య, అత్త పేరిట జాయింట్‌ ఖాతాగా మార్చాలని గ్రామ పంచాయతీకి దరఖాస్తు చేశాడు. అయితే ఖాతా మార్పిడికి దయానంద రూ.40 వేలు డిమాండ్‌ చేశారు. చివరకు రూ.35 వేలకు ఒప్పుకున్నాడు. ఈ నేపథ్యంలో మంజునాథ్‌ రూ.5 వేలను దయానందకు ఇస్తుండగా లోకాయుక్త అధికారులు దాడిచేసి అతనిని అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

సీఎంపై అనుచిత వ్యాఖ్యలు..బీజేపీ ఎమ్మెల్యేపై కేసు

యశవంతపుర: సీఎం సిద్ధరామయ్య 24 మంది హిందూ కార్యకర్తలను హత్య చేశారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన దక్షిణ కన్నడ జిల్లా బెళ్తంగడి బీజేపీ ఎమ్మెల్యే హరీశ్‌ పూంజాపై పోలీసులు కేసు నమోదు చేశారు. బెళ్తంగడి పట్టణంలోని కిన్యమ్మ సభా భవనంలో బీజేపీ కార్యకర్తల భేటీలో ఎమ్మెల్యే మాట్లాడుతూ 24 మంది హిందూ కార్యకర్తలను హత్య చేసిన సిద్ధరామయ్యకు జనం ఓటు వేశారంటూ మాట్లాడారు. భజరంగదళ్‌ను నిషేధిస్తామని చెప్పిన కాంగ్రెస్‌కు ఓటు వేశారంటూ, ఇది ఏ తరహా హిందూత్వమని అన్నారు. గౌడ సముదాయంపై కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే మాటలపై బెళ్తంగడి నగరసభ సభ్యుడు మహమద్‌ రియాజ్‌ ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు.

సభాపతిగా ఖాదర్‌ ఏకగ్రీవం

శివాజీనగర: విధానసభ నూతన సభాపతిగా కాంగ్రెస్‌ ఎమ్మెల్యే యూటీ ఖాదర్‌ ఫరీద్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బుధవారం విధానసౌధలో ఈ ఎన్నికల ప్రక్రియ జరగ్గా, ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పదవికి ఆయన మాత్రమే నామినేషన్‌ సమర్పించారు. ప్రతిపక్ష పార్టీలైన బీజేపీ, జేడీఎస్‌లు పోటీ చేయలేదు. ముఖ్యమంత్రి సిద్దరామయ్య స్పీకర్‌ పదవికి యూ.టీ.ఖాదర్‌ పేరును సూచించగా అందరూ ఆమోదించారు. ఆ తరువాత తాత్కాలిక స్పీకర్‌ ఆర్‌.వీ.దేశ్‌పాండే యూ.టీ.ఖాదర్‌ను సభాపతిగా ఎన్నుకునే తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టగా అందరూ ఆమోదించారు. ఖాదర్‌ను సీఎం సిద్దరామయ్య, డీసీఎం డీ.కే.శివకుమార్‌, మాజీ సీఎం బసవరాజ బొమ్మై తదితరులు స్పీకర్‌ పీఠం వద్దకు తీసుకెళ్లి కూర్చోబెట్టారు.

ఆ చట్టాలను రద్దు చేస్తాం

యశవంతపుర: బీజేపీ ప్రభుత్వంలో తెచ్చిన అనేక చట్టాలను పరిశీలించి రద్దు చేస్తామని మంత్రి ప్రియాంక ఖర్గే తెలిపారు. ఆయన బుధవారం బెంగళూరులో విలేకరులతో మాట్లాడుతూ బీజేపీ తెచ్చిన విద్యాలయాల్లో హిజాబ్‌ నిషేధం, గోహత్య నిషేధ చట్టం తదితరాలను రద్దు చేయాలనే ఉద్దేశం ఉందన్నారు. చట్టాలను ఉల్లంఘిస్తే ఆర్‌ఎస్‌ఎస్‌ను కూడా నిషేధిస్తామన్నారు. అభివృద్ధికి అడ్డుపడే ఇతర చట్టాలను పునః పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు.

న్యూస్‌రీల్‌

Read latest Karnataka News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top