సాక్షిప్రతినిధి, కరీంనగర్/కరీంనగర్:
అభివృద్ధిలో జిల్లా ఆదర్శంగా నిలుస్తోందని ఎస్సీ, ఎస్టీ సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పేర్కొన్నారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లాకేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో మంగళవారం నిర్వహించిన వేడుకల్లో పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ మాట్లాడుతూ అమరవీరుల త్యాగాలు, ఉద్యమకారుల పోరాటాల ఫలితంగానే తెలంగాణ ఆవిర్భవించిందన్నారు. 2014 జూన్ 2న సాకారమైన స్వప్నం నేడు అభివృద్ధి, సంక్షేమం, ఆత్మగౌరవానికి ప్రతీకగా దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందిందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం ప్రగతి పథంలో దూసుకెళ్తోందన్నారు. రాష్ట్రాన్ని ప్రపంచస్థాయి ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ‘తెలంగాణ రైజింగ్–2047’ దిశానిర్దేశక పత్రాన్ని రూపొందించిందని, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు, సంపద సృష్టి, ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యాలని వివరించారు. జిల్లాలో ‘ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక’ విజయవంతంగా అమలవుతోందని, వేలాది ప్రభుత్వ కార్యాలయాల్లో పరిశుభ్రత కార్యక్రమాలు, పెండింగ్ ఫైళ్ల పరిష్కారం చేపట్టినట్లు వివరించారు.


